టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా కొన్నిసార్లు పార్టీలే జరగవు: మాధవీలత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్‌లో విచ్చలవిడిగా డ్ర‌గ్స్ వాడకంపై న‌టి కంగ‌నా ర‌నౌత్ చేసిన సంచలన వ్యాఖ్య‌ల‌ను న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త తాజాగా స‌మ‌ర్థించారు.

అంతేకాదు, ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌లోనూ న‌డుస్తోందని, కొన్నిసార్లు డ్రగ్స్ లేనిదే టాలీవుడ్‌లో పార్టీలు కూడా జరగవంటూ ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

- Advertisement -

ఈ మేర‌కు ఫేస్‌బుక్‌లో మాధవీలత ఒక పోస్ట్ పెట్టారు. సుశాంత్ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అడుగు పెట్టడం మంచిదేనని, బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజమేనని పేర్కొన్నారు.

అయితే ఇదిగో అదిగో అని ఫైనల్‌గా తుస్సుమనిపిస్తారేమో అని తనకు అనుమానమని, ఎందుకంటే అక్క‌డ అంతా బడా బాబులే కదా.. అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుందని ఆమె వ్యాఖ్యానించారు.

కానీ డ్రగ్స్ వాడకం నేరం. ఒక పేదవాడికి అన్నం పెడతారో, లేదో కానీ మాద‌క ద్ర‌వ్యాల కోసం వేల‌కు వేలు పెడతారు. సరే, అది వాళ్ళ ఇష్టం.. అంటూ మాధవీలత ముక్తాయించారు. 

భార‌త్‌లో అనుమ‌తి ఉన్నవి తినండి, తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి. కానీ ఇతర దేశాల మాద‌క ద్ర‌వ్యాలు ఎందుకు? ఆ మత్తులో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.

‘‘తెలంగాణ‌ ఎన్సీబీ సార్లు.. మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. డ్ర‌గ్స్ మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది. ఇక్కడ అది లేకుండా కొన్నిసార్లు పార్టీలే జరగవు..’’ అని మాధవీలత తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

2009లో వచ్చారు, కానీ పొలిటికల్ అండతో వెనక్కి వెళ్లిపోయారు. పాపం.. డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి వేరే శాఖ‌కు బ‌దిలీ చేశారు. చట్టానికి చేతులు చాలా పెద్దవి. అందుకే అవి చాచితే విరగొడతారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

మ‌త్తులో చాలా దారుణాలు జరుగుతున్నాయని.. సినిమా వాళ్లు, ప‌బ్బులు, విద్యార్థులు వాటిని బాగా వాడుతూ మాద‌క ద్ర‌వ్యాల వారికి భారీగా ఆదాయాన్ని పెంచుతున్నారని, కాస్త చూసి అదుపులో పెట్టండి అంటూ హితవు పలికారు.

అంతేకాదు, “అమ్మో నాకు భయంగా ఉంది. ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో?’’ అంటూ మాధవీలత అనుమానం వ్యక్తం చేశారు. 

ఎవరూ డ్రగ్స్ జోలికి పోరని, సంబంధిత అధికారులు కూడా చూసీ చూడనట్లే ఉంటారని, డ్రగ్ డీలర్లను పట్టుకోవడం అంటే వారికి భయమని, ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయండి అంటూ ఆఫీస‌ర్ల‌పై ఒత్తిడి తెస్తాయి కదా అని వ్యాఖ్యానించారు.

‘‘ఈ పోస్ల్ వల్ల నాకు ఏదైనా హాని జరిగితే.. చట్టం చేతకానితనం అని నేనే వెళ్లి కేసు పెట్టాల్సి వ‌స్తుందేమో..” అంటూ టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియాపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు నటి మాధవీలత.

 

- Advertisement -