జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం రాదేమో.. ఓవైపు ఆనందం, మరోవైపు బాధ: రమ్యకృష్ణ

4:57 pm, Sat, 16 May 20
actress-ramya-krishna-enjoying-corona-time-at-home

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎవరికి వాళ్లు ఇంట్లోనే బందీలుగా ఉంటున్నారు. ఎన్ని సడలింపులు ఇచ్చినా కొన్ని వర్గాల వారు బయటికి రాలేని పరిస్థితి. సెలబ్రిటీలు సైతం ఇంటిపట్టునే ఉండిపోయారు.

ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారు. నిత్యం షూటింగులతో బిజీగా గడిపేసే తారలు.. ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో ఇళ్లల్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. 

‘శివగామి’ రమ్యకృష్ణ కూడా అదే అంటోంది. అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది.

రమ్యకృష్ణ ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లోను, పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రంలోనూ, అలాగే సాయిధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది. 

‘’ఓ విధంగా చెప్పాలంటే, ఈ లాక్‌డౌన్ అనేది జీవితంలో ఓ కొత్త అనుభవం. ఇంత ఖాళీ సమయం, ఏకాంతం గతంలో ఎన్నడూ నాకు దొరకలేదు. చాలా హాయిగా వుంది..’’ అంటూ మనసులోని మాట చెప్పింది రమ్యకృష్ణ.

అంతేకాదు, గత రెండు నెలలుగా తాను గడపదాటి బయటికి వెళ్లలేదని, జీవితంలో అసలెప్పుడూ ఇలా ఇంటికి అతుక్కుపోతానని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది.

ఇప్పుడు కావలసినంత సమయం లభించిందని, ఈ సమయం అంతా కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేయడానికే ఉపయోగిస్తున్నానని, జీవితంలో మళ్లీ బహుశా ఇలాంటి సమయం దొరకదేమో అని చెప్పింది.

అయితే, ఆనందంతోపాటు కొంత బాధ కూడా ఉందని రమ్యకృష్ణ పేర్కొంది. వలస కార్మికులు, నిరుపేదలు ఈ సమయంలో చాలా కష్టాలు పడుతున్నట్టు వార్తలు వింటున్నాం కదా.. త్వరగా వారి కష్టాలు తీరాలని కోరుకుంటున్నానని తెలిపింది.