పవన్ రీఎంట్రీ సినిమాలో మాజీ భార్య రేణు దేశాయ్?

12:41 pm, Sun, 2 February 20

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్న విషయం ఇప్పటికే బయటకు వచ్చినప్పటి నుంచి టాలీవుడ్‌లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఎందుకో తెలుసా? ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తున్నట్టు వార్తలు రావడమే. బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మే 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పవన్, రేణు దేశాయ్ తొలిసారి బద్రి సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత జానీ సినిమాతో జోడీ కట్టారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

సినిమాలో భాగంగా వచ్చే చైల్డ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలలో రేణుదేశాయ్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ దర్శకురాలిగా వ్యవసాయం, రైతులు కాన్సెప్ట్ తో ఓ సినిమాని తెరకేక్కిస్తున్నారు.

నటిగా స్కోప్ ఉన్న పాత్రల్లో ఉంటే నటించేందుకు సిద్ధమేనని రేణు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా వచ్చిన ‘చూసీ చూడంగానే’ చిత్రంలో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా చేయలేకపోయినట్టు ఇటీవల ఆమె స్వయంగా వెల్లడించారు.

పవన్ ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇందులో పవన్ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.