‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలైతే.. ఏమవుతుంది? ఈ సినిమాపై.. ఎందుకంత ఆసక్తి..?

3:00 pm, Sat, 16 March 19
RGV-Lakshmis-NTR
ఈ నెల  22న రాంగోపాల్ వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రం విడుదల కాకుండానే అడ్డంకులు తలెత్తుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను ఎన్నికల తర్వాత విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు.

అయితే, ‘‘ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం.. ఇది అందరికీ తెలిసిన కథే.. నేను కొత్తగా చెప్పిందేమీ లేదు.. నిజానికి చాలామందిలా నేనక్కడ లేను.. నాకు ఆ సంఘటన తెలిసున్న వాళ్లు చెప్పింది.. నేను నిజమని నమ్మింది తీశాను.. నాకు నచ్చిన సినిమా నేను ఎలా తీశానో.. అలాగే కంప్లయింట్ చేసేవారు చేసుకోవచ్చు.. సినిమా విడుదలను ఆపే పరిస్థితులే వస్తే న్యాయస్థానాలు ఉన్నాయి..’’ అంటున్నారు దర్శకుడు ఆర్జీవీ.

మరి ఈ సినిమా విడుదలైతే తెలుగుదేశం పార్టీకి నష్టమా? సినిమా ప్రభావం నిజంగానే రాజకీయంపై పడుతుందా? వివరాల్లోకి వెళితే…

ఎన్టీఆర్… నందమూరి తారక రామారావు.. ఈపేరు తెలియని ఆంధ్రుడు ఉండడు. ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో ఉండే ఎన్టీఆర్ నిజ జీవితంలో ఒక్క మచ్చ, వివాదాల్లేకుండా.. ప్రజలకు మంచి పాలన అందించాలని ఎంతో తపన పడిన మహానుభావుడు.

అయితే అనుకోకుండా 70 ఏళ్ల తర్వాత ఆయన జీవితంలో ఊహించని ఘటన జరిగింది. ఆయన ఆటోబయోగ్రఫీ రాసేందుకు నియమించిన లక్ష్మీ పార్వతీ.. అనుకోకుండా ఆయన జీవితంలోకే ప్రవేశించి.. ఆయన ఆటోగ్రఫీలో తనే ఒక వివాదస్పద చాప్టర్ అయిపోయింది.

లక్ష్మీ పార్వతి ప్రవేశంతో..

అంతవరకు ఆయన సాగించిన జీవితం ఒక దిక్కునకు సాగితే.. లక్ష్మీ పార్వతి ప్రవేశంతో.. మరో దిక్కునకు సాగిపోయింది. ఈ క్రమంలో సాఫీగా సాగిపోతున్న ఎన్టీఆర్ జీవితంలో తీవ్ర అలజడులు మొదలయ్యాయి. కుటుంబంలో కలతలు మొదలయ్యాయి.

కొత్తగా ఒకరు ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి.. అంతా తానే కావడం.. అంటే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. అంతా తానే అనేమాటకు అర్థం.. అప్పటివరకు ఎన్టీఆర్‌కి ఉన్న పిల్లలు, మనవలు, కుటుంబ సభ్యులు ఆయన దగ్గరకు సరాసరి వచ్చేసేవారు. ఆ చొరవ ఉండేది.. కానీ ఇప్పుడు ద్వారపాలకుడిలా ఒకరు తయారయ్యారు.

ఎన్టీఆర్‌కు ఫోను చేస్తే లక్ష్మీ పార్వతి తీస్తారు. నాన్నగారున్నారా? అంటే.. నిద్రపోతున్నారు.. అని ఆమె చెప్పినా అవతలి వ్యక్తులకు అది నిజమో, అబద్ధమో తెలియని పరిస్థితి. ఇదే వ్యవహారం అటు ఇంటిలో, ఇటు పార్టీలో వారికెదురైంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే..

ఒకవేళ ఎన్టీఆర్ ఇప్పుడొద్దు తర్వాత మాట్లాడతాను అని కూడా అనవచ్చు.. ఆ సంగతి అవతలి వాళ్లకు తెలీదు కదా.. సడన్‌గా ఒక కొత్త వ్యక్తి వచ్చి.. పెత్తనం చేస్తున్నట్టుగా వారు ఫీలవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అందరికీ తెలిసిన విషయం పార్టీలో ఎమ్మెల్యేలందరూ ప్లేటు ఫిరాయించడం.

పార్టీని కాపాడింది చంద్రబాబేనా…

అలాంటి పరిస్థితుల్లో వారందరూ అటూ ఇటూ చెదిరిపోకుండా.. పార్టీ పునాదులు దెబ్బతినకుండా ముందుకొచ్చి నిలబడి.. పార్టీని చంద్రబాబు కాపాడారని కొందరంటారు. కాపాడిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి ఆశించడంతో.. వ్యవహారమంతా ఆయనపైకి మళ్లిపోయిందని మరికొందరి వాదన..

అవునన్నా.. కాదన్నా.. ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగితే జరిగి ఉండవచ్చుగాక.. కానీ ఆయన కుటుంబానికి మాత్రం అన్యాయం జరగలేదు. అది ఎవరూ కాదనలేని సత్యం. పార్టీ పగ్గాలు తీసుకున్న చంద్రబాబునాయుడు.. తెలుగుదేశం పార్టీని బతికించడంలో కృతకృత్యుడయ్యారు.

అలాగే ఎన్టీఆర్ కుటుంబం ఏదైతే ఉందో అంటే కుమారులు ఎవరూ కూడా నిలకడలేని వారుగానే ఉన్నారు. మేం ఇది సాధించామని చెప్పుకునే వాళ్లు ఒక్కరు లేరు. అదిగో బాలకృష్ణ ఒక్కరు మాత్రం ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. ముందుకెళ్లారు తప్ప.. మిగిలిన వారెవరూ లైమ్‌ లైట్‌లో లేరు.

పారిశ్రామికంగాగానీ, స్టూడియో నిర్వహణ పరంగాగాని, రాజకీయంగాగానీ.. ఎందులోనూ వారు అప్పటికి రాణించలేదు. వాళ్ల నాన్న ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తులేవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచారు. కనీసం వాటిని పెంచారో లేదో కూడా తెలీదు.

అలాంటి కుటుంబంలో ప్రతి ఒక్కరిని చంద్రబాబునాయుడు కంటికి రెప్పలా కాపాడాడు. ఒక్కరు కూడా రోడ్డున పడకుండా చూశారు. తారకతర్నకు 30 సినిమాల వరకు అవకాశాలిచ్చినా ఆయనా హీరోగా నిలదొక్కుకోలేదు. కళ్యాణరామ్ ఓం అనే సినిమా తీసి 25 కోట్ల వరకు నష్టపోయారు. అదే మరొకరైతే.. అంతేసంగతి..

అక్కినేని నాగార్జున తన తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ని చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఇటు ఎన్టీఆర్‌ కూడా రామకృష్ణ స్టూడియో స్థాపించారు. కానీ..అదెలా ఉంటుందో చూడండి. అలాగే ఎన్టీఆర్ చెన్నైలో నివసించిన ఇల్లు.. ఆ రోజుల్లో ప్రజలకి అదోక పర్యాటక ప్రాంతమే. 

అలాంటి గొప్ప ఇంటిని కూడా ఆయన పుత్రులు పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తండ్రి జ్ఞాపకాలను పట్టించుకోని వారు.. అదే ఎన్టీఆర్ చివరి రోజుల్లో.. తనకు సేవ చేసేందుకు ఒక మనిషి అవసరమై లక్ష్మీ పార్వతిని చేరదీసి ఉండవచ్చు.. అయితే ఆయన కూడా మొండి మనిషి.. ఎవరినీ లెక్కచేయని తత్వం.. దాంతో ఎవరో ఏదో అంటే ఆవేశంతో ఆమెను వివాహం చేసుకోవడంతో.. సమస్య మరింత ముదిరిపోయింది.

కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు..

రాజకీయ లబ్ధి కోసం కావచ్చు.. ఎన్టీఆర్‌తో ఈగోస్ దెబ్బతిని.. ఆయన్ని దెబ్బతీయాలనే భావనతో కావచ్చు.. కొందరు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశారు. 70 ఏళ్ల వయసులో ఆయన పిల్లల కోసం ప్రయత్నించారు, స్టెరాయిడ్లు వాడారనే ప్రచారం జరిగితే..ఎవరు నమ్ముతారు?

అసలు చెప్పిన వారికి, విన్న వారికి, రాసిన వారికి, మాట్లాడుకున్న వారికి కనీస అవగాహన లేకుండా.. అది నిజంగా తను దేవుళ్లుగా భావించిన ప్రజలే చర్చించుకునే పరిస్థితి తలెత్తడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు.

రాముడంతటివాడిపైనే నిందలేసిన లోకంలో.. ఆ పాత్రలను తనే పోషించిన రామారావు.. ఆ క్షణంలో కోల్పోయిన మనోధైర్యం.. అప్పటికే పదవి పోయిన అవమానభారం, అంతకుమించి వయోభారం.. ఇవన్నీ ఆయన మరణానికి కారణమయ్యాయి.

ఈ రోజుల్లా ఆ రోజుల్లో కూడా సోషల్ మీడియా ఉండి ఉంటే.. అసలు 70 ఏళ్ల వయసులో పిల్లల్ని కన్నవారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో.. ఆ మంచీ చెడు, ముందూ వెనుక అన్నీ గణాంకాలతో సహా వచ్చేసేవి..

రామారావు తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి వ్యాయామాలు చేసి.. టిఫిను చేసి ఉదయం పది గంటలకు భోజనం చేసి రాత్రి 7 గంటలకు భోజనం చేసి ఒక అత్యంత కఠినమైన, కఠోరమైన క్రమశిక్షణతో మెలిగే ఆయన.. నిజానికి సినిమా ఇండస్ట్రీలో అందరి కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించే వారని కొందరనే మాట..

కానీ రాజకీయం ఒక మత్తు.. ఒక వ్యసనం.. ఐఏఎస్ అధికారులు, మంత్రులు, మందీ మార్బలం.. ఒక ముఖ్యమంత్రి వస్తుంటే హడావుడి.. ఇది రాజ్యకాంక్ష.. ఆ పదవి, ఆ చుట్టూ ఉన్నవారందరూ వెళ్లిపోవడం.. అంతా అంధకారం కావడంతో ఆయన అర్థాంతరంగా కళ్లు మూశారని సన్నిహితులు చెప్పే మాట.

అందరికీ తెలిసిందే.. కొత్తేముంది?

చూశారా.. ఇంత వరకు మీరు చదివింది.. నేను రాసింది.. నాకు ఎన్టీఆర్ జీవితంపై ఉన్న అవగాహనతో రాశాను.. నేనే ఇంత రాశాను.. ఇవన్నీ మీకూ తెలుసు.. నాకూ తెలుసు.. రాంగోపాల్ వర్మకి తెలుసు.. అదే ఆయన తీశాడు.. ఇందులో కొత్త విషయం ఏముంది? ఎందుకంత ఆతృత?

అందరిలో మీరు చాలా ధైర్యంగా తీశారని ఆర్జీవిని కీర్తించడం.. కరెక్ట్ కాదని కొందరి వాదన..  ఆయన కూడా అదే అంటున్నాడు.. నేను ఎన్టీఆర్ చనిపోయిన రోజున లేను. నలుగురు చెప్పినది విని, అందులో నమ్మబుల్ గా ఉన్నవని అనిపించినవి తీశాను.. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే..

ఎన్టీఆర్ జీవితం ఒక తెరచి ఉంచిన పుస్తకం.. కొత్తగా నేను చెప్పిందేమీ లేదు.. అంటున్నారు రామ్‌ గోపాల్ వర్మ. అయితే ఆయనెంత నిఖార్సుగా మాట్లాడినా.. నాకు విలువల్లేవు అని మాట్లాడే ఆయన.. ఎన్నికల ముందు సినిమా రిలీజ్ అవుతుంటే.. అందులో ఏ స్వార్థం లేదని చెప్పలేం. ఇది రాజకీయ స్వార్థంతో కొందరు తీసిన సినిమా.. అందులో సందేహమే లేదు.

కానీ… ఒకమాట.. ఓపెన్‌గా మాట్లాడాలి అంటే.. లక్మీపార్వతితో అనుబంధం.. వివాహ బంధంగా మారకముందు.. అంటే ఆ కొద్దికాలమేదైతే ఉందో.. ఆ సమయంలో ఎన్టీఆర్‌పై రకరకాల వదంతులు వచ్చాయి. అది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇన్నేళ్లయినా అదే ఆసక్తి.

అప్పుడు జనం తెలివైన వారు కాదు.. పెద్ద పెద్ద చదువులు ఉండేవి కావు.. కానీ ఆ ఆసక్తి ఆనాటి జనాలందరిలో ఎలా ఉందో.. ఇంత విజ్ఞానం నిండిన ప్రస్తుత ప్రపంచంలో తిరిగే ప్రజల్లోనూ ఇప్పటికీ అలాగే ఉండటం.. అంటే ఒక పాతదైపోయిన కథా వస్తువును తీసుకొని.. తిరిగి కొత్తగా తీస్తున్నారు.. అదీ కొత్త, పాత ప్రేక్షకుల కోసం.

మేథావులేమంటున్నారంటే…

కానీ కథా వస్తువు పాతదైనా.. అందులో ఒక స్త్రీ-పురుష సంబంధంపై ఇంత చర్చ అవసరమా? అనేది కొందరు మేథావుల మాట. మనం ఏం లోకంలో ఏ కాలంలో ఉన్నాం? ఈ సినిమా వల్ల ఏం సాధిస్తాం? చివరికి రాజకీయంగా గెలవాలంటే ఇంతకన్నా సబ్జక్టు దొరకలేదా?

ఆనాడు సూపర్ స్టార్ కృష్ణగారు మండలాధీశుడు అనే సినిమా తీశారు. ఎన్టీఆర్ వ్యవహారశైలి, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై తీశారు. అలా తీయవచ్చు కదా? ఒక నైతికతకు సంబంధించిన విషయం, నాల్గుగోడల మధ్య జరిగిన ఒక దంపతుల విషయం, ఒక కుటుంబ వ్యవహారం.. ఇవి అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మన కుటుంబంలో ఒక పర్సనల్ వ్యవహారం ఇలా బయటకొస్తే.. ఎవరైనా ఊరుకుంటారా? అని కూడా కొందరడుగుతున్నారు. ఇది రాజకీయంగా తెలుగుదేశానికి ఇబ్బందికరమా? అంటే ఇంక కొత్తగా తెలియని అంశం ఇందులో ఏముంది? అంతా తెలిసినదే..  

అయితే ఆర్జీవీని తక్కువగా అంచనా వేయలేం. అందుకనే వైస్రాయ్ హోటల్ సంఘటనని హైలైట్ చేసి.. ఇంతవరకు నేను పైన రాసినవన్నీ పక్కన పెట్టి.. ఎన్టీఆర్ మహానాయకుడు 70 ఏళ్లు మచ్చ లేకుండా గడిపి, చివరిరోజుల్లో చేసిన పనుల వల్ల.. ఆ 70 ఏళ్ల జీవితాన్ని.. ఈ నాలుగున్నరేళ్లతో ముడిపెట్టి అపహాస్యం చేసేలా చేయడం కరెక్ట్ కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అంటే చంద్రబాబు చేసింది తప్పుకాదంటారా? అంటే.. బహుశా లక్ష్మీపార్వతి అనే క్యారెక్టర్ ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ కాకపోయి ఉంటే.. అప్పుడు కూడా పదవీ కాంక్షతో చంద్రబాబు ఆయన్ని దించేసి అధికారం అందిపుచ్చుకుంటే అది తప్పు.. కానీ ఇక్కడలా జరగలేదు.

కానీ చివరికి ఒక కన్‌క్లూజన్ ఏమిటంటే.. నిజంగా ఇవన్నీ కాదు.. ఎన్టీఆర్ సంపూర్ణంగా వందేళ్లు జీవించి మరణిస్తే.. ఆ తర్వాత ఎవరు అతని కుటుంబంలో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించే సమర్థుడున్నాడు? అప్పుడైనా ఈ చంద్రబాబునాయుడే కదా రావాలి.

సినిమా విడుదలైతే జరిగేదేంటి?

ఇటీవల బాహుబలి సినిమాలో.. రమ్యకృష్ణ చెప్పిన మాటేమిటంటే.. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే.. రాజతంత్రం ఉండాలి. బహుశా అది చంద్రబాబు నాయుడు పాటించి ఉంటే.. ఆర్జీవి తీసిన సినిమా చూసి చెప్పాలి. అయితే అందరూ అనుకున్నట్టు సినిమా వస్తే ఏం జరగదు? అందరూ చక్కగా సినిమా చూసి వెళతారు.

బహుశా వస్తే ప్రొడ్యూసర్‌కి నాలుగు డబ్బులొస్తాయి. కానీ ఓటు వేసే వారు మాత్రం.. ఎన్నికల రోజు ఏప్రిల్ 11న తాము అనుకున్న వారికే ఓటేస్తారు. నిజంగా ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగిందని ప్రజలు అనుకుని ఉంటే తెలుగుదేశం  పార్టీ ఎప్పుడో భూస్థాపితమై పోయేది.

ఎందుకంటే పార్టీని నడిపి, నిర్వహించే సమర్థులైన వారసులు ఎన్టీఆర్‌కి లేరు.. ఇదీ అసలు నిజం. నిజంగా ఆ రోజున కుటుంబ సమస్య పెద్దదైతే.. వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పీఠమెక్కి ఉంటే ఎవరూ ప్రశ్నించి ఉండేవారు కారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో మరి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ని పక్కన పెట్టి.. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ బాధ్యతలు తీసుకోలేదా? ఈ విషయంలో ప్రజలెవరూ స్పందించను కూడా లేదు. ఒహో.. అనుకున్నారు.. ఊరుకున్నారు.

ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కూడా అంతే. ఆర్జీవి ఎప్పుడూ చెప్పే మాట..  నేను సినిమా తీశాను.. నా ఇష్టం.. నిన్నెవడు చూడమన్నాడు.. నీకిష్టమైతే చూడు.. లేకపోతే లేదు అంటారు.. ఇదీ అంతే.. అంతేగా!

– శ్రీనివాస్ మిర్తిపాటి