‘‘చరణ్‌.. దిస్‌ ఈజ్‌ అమితాబ్‌..’’: మెగా పవర్ ‌స్టార్‌కి.. తెలుగులో బర్త్ డే విషెస్ చెప్పిన బిగ్ బీ!

5:45 pm, Wed, 27 March 19
Ramcharan Tej News, Amitab Bacchan Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్ : నేడు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ వీడియో ద్వారా చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపారు.

ఈ వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అమితాబ్ బచ్చన్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘అమితాబ్ ఇచ్చిన ఈ సందేశం చెర్రీకి స్వీటెస్ట్ గిఫ్ట్.. నా చేతులు వణుకుతున్నాయి.. చాలా ఎగ్జైట్ అయ్యాం..’’ అని ట్యాగ్ చేసింది ఉపాసన.

ఆ వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ.. ‘‘చరణ్‌.. దిస్‌ ఈజ్‌ అమితాబ్‌. మార్చి 27 ఈ రోజు నీ పుట్టిన రోజు. నా నుంచి, అలాగే నా ముంబై కుటుంబం నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. మున్ముందు నీకు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నా..’’ అన్నారు.

అంతేకాదు, ‘‘నీ వయసెంతో నాకు తెలీదు కానీ.. నిన్ను చూసిన ప్రతిసారీ నాకు 18 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తావు. నీ మాతృ భాషలో చెబుతున్నా.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..’’ అని అన్నారు. ఈ వీడియో చూసి మెగా అభిమానులు తెగ మురిసి పోతున్నారు.

మెగా‌స్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తూ రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.