బిగ్ బాస్ సీజన్ 3లో పలు మార్పులు.. హోస్ట్‌గా హీరోయిన్ అనుష్క!?

10:55 am, Mon, 22 April 19
anushka-shetty

హైదరాబాద్: తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్స్ పూర్తి చేసుకొని మూడో సీజన్‌లోకి అడుగు పెడుతోంది. గత సీజన్‌కి నేచురల్ స్టార్ నాని వాఖ్యతగా వ్యవహరించగా, మొదటి సీజన్ కంటే రెండో సీజన్ మరింత రసవత్తరంగా.. అనేక వివాదాలతో నడిచింది.

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3కి నిర్వాహకులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సీజన్ కోసం మొత్తం 20 మందితో కంటెస్టెంట్స్ జాబితా అయితే రెడీ అయినట్టు తెలుస్తోంది.

ఈసారి కంటిస్టెంట్‌లుగా బాగా గుర్తింపు ఉన్న స్టార్స్‌ని రంగంలోకి దించుతున్న బిగ్ బాస్ టీం.. అందులో హాట్ యాంకర్ల పేర్లు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. రష్మి, ఉదయభాను, ఝాన్సీ, లాస్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మేల్ యాంకర్స్‌లో  ప్రదీప్‌, రవి ఇద్దరిలో ఒకరు ఉంటారని టాక్.

జబర్దస్త్ నుంచి ఇద్దరిని బిగ్ బాస్ కంటిస్టెంట్లు...

అంతేకాదు, ఈసారి జబర్దస్త్ నుంచి ఇద్దరిని బిగ్ బాస్ కంటిస్టెంట్‌లుగా తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు బిగ్‌బాస్ 3కి హోస్ట్ గా మళ్ళీ ఎన్టీఆర్‌ని తీసుకురావాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంతో ప్రయత్నించారు. కానీ, ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో తనవల్ల కాదని చెప్పేశారు.

దీంతో ఈసారి హోస్ట్‌గా హీరోకి బదులు ఎవరైనా హీరోయిన్‌ని తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బిగ్‌బాస్ నిర్వాహకులకు వచ్చిందట.  ఆలోచన వచ్చిందే తడవుగా హీరోయిన్ అనుష్కను సంప్రదించి ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్టు వార్తలు వినవస్తున్నాయి.

అయితే ఈ విషయం గురించి అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అదే నిజైమెతే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా అనుష్క ఏ విధంగా రాణిస్తుంది? ఆ కార్యక్రమానికి ఎంతవరకు న్యాయం చేస్తుంది? అనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే.