బ్రేకింగ్: వర్మకు షాక్! ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఆపేసిన హైకోర్టు!!

8:02 pm, Thu, 28 March 19
ap-high-court-stall-the-film-lakshmis-ntr-release

అమరావతి: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆరంభం నుంచి అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ చిత్రం విడుదలను ఏపీ హైకోర్టు ఆపేసింది. నిజానికి ఈ చిత్రం మార్చి 22నే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల మార్చి 29కి వాయిదా పడింది.

మరోవైపు ఈ చిత్రం విడుదలను ఎలాగైనా అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికల సంఘానికి వారు ఫిర్యాదు చేసినా.. అది పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఇక ఖాయం అనుకుంటున్న తరుణంలో.. దాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలను ఆపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదినుంచీ సంచలనమే…

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు రెండూ ఎలాంటి ఆటంకాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మాత్రం ఆది నుంచీ అడ్డంకులు ఎదురయ్యాయి. దీనికి కారణం.. వర్మ ఈ సినిమా ద్వారా.. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పద అంశాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేయడమే.

చంద్రబాబును నెగెటివ్ రోల్‌లో…

ఈ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని నెగెటివ్ రోల్‌లో చూపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆది నుంచీ ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే రామ్ గోపాల్ వర్మ వారి ఆందోళనను ఏమాత్రం పట్టించుకోలేదు. తన మానాన తాను ఇతర అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా తీసిపారేశారు.

హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేతలు…

దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. కనీసం ఎన్నికలు ముగిసే వరకైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వాయిదా వేయాలంటూ ఫిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా.. టీడీపీ తరుపున న్యాయవాది తన వాదనను బలంగా వినిపించారు.

రామ్ గోపాల్ వర్మ రాజకీయ ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఈ చిత్రం ప్రభావం కచ్చితంగా ప్రస్తుతన ఎన్నికలపై ఉంటుందని, ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మే సోషల్ మీడియాలో తెలిపారంటూ టీడీపీ తరుపున న్యాయవాది వాదించారు. అంతేకాదు, ఎన్టీఆర్ జీవితంలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలతో సినిమా తీసి.. సరిగ్గా ఎన్నికల ముందు వర్మ తన చిత్రాన్ని విడుదల చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన ఆంతర్యం ఏమిటని కూడా న్యాయవాది ప్రశ్నించారు.

ఆ వాదనతో ఏకీభవించిన హైకోర్టు…

దీంతో హైకోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించింది. ఏప్రిల్ 15, 2019 వరకు ఈ చిత్రాన్ని సినిమా థియేటర్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర మాధ్యమాలలో ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైకోర్టు జడ్జి ఛాంబర్‌లో ఈ చిత్రం ప్రివ్యూ ప్రదర్శించాలని, సినిమా చూశాక నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ఆ ఆదేశాల్లో పేర్కొంది. ప్రివ్యూకు చిత్ర నిర్మాత కూడా హాజరుకావాలని ఆదేశించింది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు హైకోర్టు స్టే విధించడం శరాఘాతమే. అలాగే ఈ సినిమాకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తీరా సినిమా విడుదల సమయానికి హైకోర్టు ఉత్తర్వులు వెలువడడం వర్మకు నిజంగా షాక్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమా విడుదలను అడ్డుకోవడంలో టీడీపీ వర్గాలు విజయం సాధించాయనే చెప్పుకోవచ్చు.