కమెడియన్ అలీకి ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్?

5:58 pm, Sat, 9 November 19

అమరావతి: టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీకి ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కమెడియన్ అలీకి జగన్ ఏం పదవి ఇస్తారన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ అయింది. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పృథ్వీకి కట్టబెట్టడంతో, అలీకి వేరే ఏదైనా పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి.

అయితే, జగన్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా అలీకి ఎటువంటి పదవీ ఇవ్వలేదు. అయితే ఇటీవల అలీకి కూడా జగన్ పదవిని సిద్ధం చేసినట్టు వార్తలు బయటకొచ్చాయి. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అలీని నియమిస్తారన్న వార్తల ప్రచారం జోరందుకుంది. ఆ పదవి కోసం అలీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాడు.

అయితే ఇప్పుడు అలీకి ఒకనాటి సీనియర్ నటుడు విజయ్‌చందర్ నుంచి ఊహించని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ పదవికి విజయ్ చందర్‌ను జగన్ ఎంపిక చేశారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

టంగుటూరి ప్రకాశం పంతులు మనవడుగా, ప్రముఖ గాయని టంగుటూరి సూర్య కుమారి మేనల్లుడుగా విజయ్ చందర్ సుపరిచితుడు. సినీ పరిశ్రమలో ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

‘కరుణామయుడు’ సినిమాతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలో కొనసాగుతూ వైసీపీకి తనవంతు సేవలు అందించారు. దీంతో విజయ్ చందర్‌కు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు బయటకు రావడం సర్వత్ర చర్చనీయాంశమైంది.