బ్రహ్మి ఈజ్ బ్యాక్! హీరోగా త్వరలో రీ ఎంట్రీ!

10:29 am, Sun, 7 April 19
Brahmanandam

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 12 కోట్లమంది తెలుగువారిలో బ్రహ్మానందం పేరు తెలియని వారుండరు. వీరందరినీ ఎదో ఒక సినిమాలో బ్రహ్మీ నవ్వించాడు. ఈమధ్య కాలంలో యంగ్ కమెడియన్స్ హవా పెరిగిపోవడంతో అవకాశాలకు దూరం అయిన ఈ హాస్య చక్రవర్తికి ఈమధ్య గుండె ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తన శస్త్ర చికిత్స తరువాత షూటింగ్ లకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్న బ్రహ్మి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యం తన అజ్ఞానాన్ని తోలిగించింది అంటూ కామెంట్స్ చేసాడు.

తనకు అనారోగ్యం వచ్చిన విషయం తెలుసుకుని తనకు ఆరోగ్యం ఎలా ఉంది ఆంటూ తన సెల్ ఫోన్ కు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చిన మెసేజ్ లు చూసి తాను షాక్ అయిన విషయాన్ని వివరించాడు.తనకోసం కొందరు అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని తెలుసుకుని ప్రేక్షకులకు తాను నవ్వులు తప్ప ఏమి ఇవ్వకపోయినా తన పట్ల చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా తాను తీసుకున్న ఒక నిర్ణయాన్ని వివరించాడు.

ఇప్పటి వరకు తనను తమ సినిమాలలో బుక్ చేసుకోవడానికి వచ్చిన దర్శక నిర్మాతలను భారీ పారితోషికం అడిగి భయపెట్టానని అయితే ఇప్పుడు తాను పారితోషికం గురించి కాకుండా కేవలం తన అభిమానులను నవ్వించడానికి మళ్ళీ వేగంగా సినిమాలు చేయబోతున్న విషయాన్ని లీక్ చేసాడు. అంతేకాదు తాను త్వరలో హీరోగా నటించబోతున్న సినిమా వివరాలను తెలియచేసాడు.

రచయిత శ్రీధర్ సిపాన వ్రాసిన కథ తనకు బాగా నచ్చడంతో ఈమూవీ ద్వారా తిరిగి తన రీ ఎంట్రీ ఉంటుందని వివరించాడు. ‘రేసుగుర్రం’ మూవీలోని కిల్ బిల్ పాత్ర టైపులో తన పాత్ర ఉంటుందని అయితే తాను ఆసినిమాలో నవ్వకుండా సీరియస్ గా ఉంటానని తన పాత్రను చూసి ప్రేక్షకులు తెగ నవ్వుతారు అని లీకులు ఇస్తున్నాడు. ఈమూవీకి ‘బ్రహ్మీ ఈజ్ బ్యాక్’ అనే టైటిల్ పెట్టే ఆలోచన ఉంది అని చెపుతున్న బ్రహ్మానందం ఈమూవీని తన కుమారులు నిర్మిస్తారు అన్న లీకులు ఇస్తున్నాడు