యాంకర్ ప్రదీప్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

12:55 pm, Sun, 2 February 20

హైదరాబాద్: ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

నిబంధనలు అతిక్రమించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ప్రదీప్ హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా రూపొందుతోంది.

 

ప్రదీప్‌ గతంలో ఒక అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజులు జైల్లో ఉన్నాడని, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు ఇది వ్యతిరేకమని, అయినప్పటికీ ప్రదీప్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని సునిశిత్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

 

ప్రదీప్‌తో పాటు ఆ సినిమా దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించారన్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.