రోడ్డెక్కిన నటుడు నాజర్ కుటుంబ వ్యవహారం!

5:17 pm, Sat, 6 April 19
najar

చెన్నై: దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నాజర్. విలన్ గానూ, క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ నాజర్ ప్రతిభను ఎవరూ తక్కువగా అంచనావేయలేరు. వ్యక్తిత్వ పరంగానూ నాజర్ కు ఇప్పటివరకు మంచిపేరే ఉంది.

అయితే, ఇటీవల నాజర్ సోదరుడు మీడియా సాక్షిగా తీవ్ర విమర్శలు చేశారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం చాతకాని వ్యక్తి నాజర్ అంటూ మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి రాజకీయాలు ఎందుకంటూ నిలదీశారు.

నాజర్ భార్య కమీలా ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ తరఫున చెన్నై సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాజర్ సోదరుడి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

నాజర్ సోదరుడు ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టుకుని మరీ నాజర్ దంపతులపై వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నాజర్ ఇప్పుడు సోదరుడి ఆరోపణలపై స్పందించారు. కొందరు రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి ప్రచారానికి తెగబడుతున్నారని ఆరోపించారు.

తన భార్య కమీలా ఎంతో స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో పోటీచేస్తోందని, ఆమెపై తన ప్రభావం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు ఏమీ చేయలేదని నాపై ఆరోపణలు వస్తున్నాయి. కానీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు నిర్వర్తించలేకపోవడానికి ఓ వ్యక్తి అడ్డుపడ్డాడు, అతడు నా కుటుంబంలోని వాడే అంటూ సోదరుడిపై విమర్శలు చేశారు. తన భార్యపై విమర్శలు చేయడానికి ఏమీ లేకపోవడం వల్లే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని నాజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు