చిత్రలహరి’ సినిమా ప్రివ్యూ! ఈసారైనా హిట్ కొడతాడా?

12:06 pm, Fri, 12 April 19
Sai Dharam Tej Latest News, Chitralahari Movie Latest News, Newsxpressonline
హైదరాబాద్: ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా ఇదే టెన్షన్ కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజన్ ఫ్లాపుల తర్వాత కూడా నిలబడ్డాడు సాయి ధరమ్ తేజ్. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు.

ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపైనే ఈయ‌న దృష్టి పెట్టాడు. ఈ సినిమా విజ‌యంపైనే సాయి కెరీర్ ఆధారపడి ఉంది.

కిషోర్ తిరుమ‌ల తెరకెక్కించిన ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 12న సినిమా విడుదలవుతుంది. సెన్సార్ టాక్ కూడా బాగానే ఉండటంతో సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం కోసం పూర్తిగా లుక్ మార్చేసాడు సాయి ధరమ్ తేజ్.

అసలు మనం ఇదివరకు చూసిన సాయినేనా ఇప్పుడు చూస్తుంది అనిపించక మానదు. ప‌క్కా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా ఈ చిత్ర‌మ‌ని.. క‌చ్చితంగా ఈ సినిమాతో తానేంటో చూపిస్తానంటున్నాడు సాయి.

విమ‌ర్శ‌కుల‌కు ఇదే నా స‌మాధానం అంటూ స‌వాల్ చేస్తున్నాడు. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్ర బిజినెస్ 13.5 కోట్లకు పైగానే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తుంది. సాయి ఇమేజ్ ప్ల‌స్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని 15 కోట్ల లోపే అన్నీ పూర్తి చేసారు మైత్రి మూవీ మేక‌ర్స్.

ఆరు ఫ్లాపుల త‌ర్వాత సాయి చాలా జాగ్ర‌త్త ప‌డి ఎంచుకున్న స్క్రిప్ట్ చిత్ర‌ల‌హ‌రి. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కాస్త తక్కువగా వచ్చేలా కనిపిస్తున్నా.. ఆ తర్వాత కచ్చితంగా పుంజుకుంటాయని నమ్ముతున్నారు చిత్రయూనిట్. పైగా చిరంజీవి కూడా ఈ చిత్రానికి కాస్త మాట సాయం చేసాడు.

దాంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా తాను ఫామ్‌లోకి వ‌స్తానంటున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో నటించాడు. ఈయ‌న ఫుల్ లెంత్ రోల్ చేసాడు. మొత్తానికి ఈ సినిమాతో క‌చ్చితంగా త‌ను మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తానంటున్నాడు మెగా మేన‌ల్లుడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని చిత్రలహరి ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌.