13 సినిమాలు చేశాను కానీ.. ఇదే స్పెషల్: మురుగదాస్

11:44 am, Sat, 4 January 20

హైదరాబాద్: నగరంలో జరిగిన ‘దర్బార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ తాను చేసిన సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు 13 సినిమాలు చేసినప్పటికీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘దర్బార్’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

రజనీకాంత్‌తో తాను చేసిన తొలి సినిమా దర్బారేనని పేర్కొన్నారు. అంతేకాదు, తాను దర్శకత్వం వహించిన తొలి పోలీస్ స్టోరీ కూడా ఇదేనని పేర్కొన్నారు. సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారని, దీంతో సినిమా బాగా వచ్చిందని అన్నారు. సినిమా నిర్మాత సుభాస్కరన్ నిజ జీవిత హీరో అని కొనియాడారు. భవిష్యత్తులో బయోపిక్ తీసేంత గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. పాన్ ఇండియా సినిమాకు కావాల్సింది ఇలాంటి నిర్మాతలేనన్నారు.

‘దర్బార్’లో నయనతార, నివేదా థామస్‌లు చాలా చక్కగా నటించారని మురుగదాస్ కొనియాడారు. రజనీకాంత్‌తో పోటీపడి మరీ సునీల్ శెట్టి విలనిజాన్ని పండించారని ప్రశంసించారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈ నెల 9న దర్బార్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.