పవన్ గారూ.. నన్ను క్షమించండి: దర్శకుడు రాంగోపాల్ వర్మ

6:39 am, Wed, 1 January 20

హైదరాబాద్: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు తెలిపారు. వర్మ నిర్మాతగా రూపొందిన ‘బ్యూటిఫుల్’ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి న్యూ ఇయర్ రిలీజ్ వేడుకలో వర్మ మాట్లాడుతూ.. గతంలో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు.

తన మనసులోని మాటను ఈ రోజు తాను బయటకు చెప్పాలని అనుకుంటున్నానని పేర్కొన్న వర్మ, పవన్ గారికి ఓ తిక్కుందని, లెక్కకంటే తిక్కే అందరికీ ఎక్కువగా నచ్చుతుందని పేర్కొన్నాడు. ఆయన అందుకే సూపర్ స్టార్ అయ్యాడన్నాడు. ‘పవన్ గారూ.. నన్ను క్షమించండి’ అని కోరాడు. తనకు శ్రీదేవి కంటే పవన్ కల్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టమని ప్రమాణ పూర్తిగా చెబుతున్నానని వర్మ తెలిపాడు.

తాను దేవుడ్ని నమ్మనని, తన మాటలను నమ్మకపోతే ఏమీ చేయలేనని వర్మ అన్నాడు.  వర్మ నిర్మాతగా వ్యవహరించిన ‘బ్యూటిఫుల్’ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ మహిళ తన కంటే సక్సెస్‌పుల్ అయితే మగాడు భరించగలడా? అన్న కథాంశంతో ఈ సినిమాను తీసినట్టు వర్మ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.