అమిత్‌ షాని కలిసిన ‘మోత్కుపల్లి’.. బీజేపీలో చేరిక…

motkupalli-narasimhulu
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ మంత్రి, తెలంగాణ టీడీపీలో కీలక నేతగా గుర్తింపు ఉన్న మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరిపోయారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికాసేపట్లో ఆయన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కూడా కలవనున్నారు.

అంతకుముందు మోత్కుపల్లి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డిలతో కలిసి వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. వీరి వెంట బీజేపీ నాయకులు వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్‌ రావు, వీరెందర్‌ గౌడ్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.

టీఆర్ఎస్‌లో చేరికపై ప్రచారం జరిగినా…

తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి చంద్రబాబునాయుడు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఒక దశలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదని, పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమే మంచిదని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరలేదుకానీ.. తెలంగాణలో క్రమంగా బలపడుతోన్న, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీలో చేరారు.

అలాంటి మోత్కుపల్లి ఇప్పుడు బీజేపీలో చేరడంతో కేసీఆర్‌కు కొత్త తలనొప్పి మొదలైనట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  మరోవైపు.. తెలంగాణలో టీడీపీ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎంపీ గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో ఆ మధ్య పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

గత శనివారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు, టీడీపీ బాల్కొండ ఇంచార్జ్ డాక్టర్ మల్లిఖార్జున రెడ్డి బీజేపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతలు కూడా పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు.

తాజాగా మోత్కుపల్లి చేరికతో తెలంగాణలో బీజేపీ దూకుడు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన వ్యక్తిగా మోత్కుపల్లి నర్సింహులుకు గుర్తింపు ఉంది. ఒక దశలో కేసీఆర్‌కు దీటైన నేత మోత్కుపల్లి అనే ప్రచారం కూడా జరిగింది.

- Advertisement -