మోహన్‌బాబుకు బెయిల్ మంజూరు.. డబ్బు చెల్లించేందుకు 30 రోజుల గడువు!

- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. దానితో పాటుగా రూ. 41.75 లక్షలను చెల్లించాలంటూ ఆదేశించింది.

ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగిస్తామని తెలిపింది. సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. 2010లో ఈ అంశానికి సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించారు.

‘సలీం’ సినిమా సందర్భంగా వైవీఎస్ చౌదరికి మోహన్ బాబు రూ. 40.50 లక్షల చెక్కును ఇచ్చారు. ఈ చెక్ నగదుగా మారకపోవడంతో వైవీఎస్ కోర్టులో కేసు వేశారు.

కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో.. మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో, మోహన్ బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజుల్లోగా దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరికి డబ్బును చెల్లించాలని ఆదేశించింది.

చదవండి: షాకింగ్: మోహన్‌బాబుకి ఏడాది జైలుశిక్ష, రూ.41.75 లక్షల జరిమానా! అసలేం జరిగింది?
- Advertisement -