‘సాహో’ సినిమా కూడా కాపీయేనా? అప్పుడే వెల్లువెత్తుతున్న విమర్శలు…

11:21 am, Sat, 31 August 19

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’పై అభిమాను తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. రిలీజైన మొదటి రోజే ‘సాహో’కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ దానితోపాటు ఈ సినిమాపై ఇప్పుడు ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. ‘సాహో’ సినిమా కాపీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా విడుదలైన చాలా సినిమాలకు కాపీ క్యాట్ అనే పేరు తెగ వచ్చేస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల అయ్యాక.. ఆ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌ని ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారమైంది. ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’పై కూడా ఇలానే వార్తలు వినిపిస్తున్నాయి.

పెయింటింగ్ వివాదం…

దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై సినీ విమర్శకులలో తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటలో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ ఛాయాచిత్రం తన పెయింటింగ్ ‘ది బర్నింగ్ మ్యాన్‌’ని పోలి ఉందని.. తన అనుమతి తీసుకోకుండానే ఆ పెయింటింగ్‌ను బ్యాక్‌గ్రౌండ్ కింద ఎలా వాడారంటూ సులెమాన్ అనే ఓ మహిళ ఆరోపించారు.

2014లో ది బర్నింగ్ మ్యాన్ వద్ద ప్రదర్శనకు పెట్టిన పెయింటింగ్ ఇది. ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సాహో పోస్టర్‌ని దాంతోపాటు ఒరిజినల్ పెయింటింగ్‌ని పోస్ట్ చేశారు.

అయితే పోస్టర్ వరకు సరే, సినిమా ఆరంభంలో వచ్చే ఫైట్ కూడా గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమా నుంచి కాపీ కొట్టారనేది మరికొందరి మాట. ఇంకా నయం.. మొత్తానికి ‘సాహో’ సినిమా కథ కూడా ఇంకో సినిమాకు కాపీ అనే ఆరోపణలు రాకపోవడం ప్రభాస్ అభిమానులకు హమ్మయ్య అనిపిస్తోంది.