‘జెర్సీ’ గౌతమ్ తిన్ననూరి నెక్ట్స్ మూవీ లో హీరో ఎవరో తెలుసా

3:20 pm, Tue, 23 April 19
jersy-goutam

హైదరాబాద్: జెర్సీ మూవీ విడుదలైన తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు టాలీవుడ్లో మారుమ్రోగిపోతోంది. టాలీవుడ్లో ఇలాంటి మంచి సినిమా తీసే ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా అందరూ గౌతమ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జెర్సీ సినిమా విడుదల ముందు జరిగిన ప్రెస్ మీట్లు, విడుదలైన తర్వాత జరుగుతున్న సక్సెస్ మీట్లలో హీరో నాని గౌతమ్ తిన్ననూరి టాలెంట్ గురించి వెల్లడిస్తూ, అతడు పెద్ద దర్శకుడు అవుతాడు అంటూ పొగడ్తలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నిజంగా ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం గౌతమ్ అతి త్వరలోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అసలు విషయానికొస్తే..జెర్సీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న గౌతమ్, తన తరువాత సినిమాని టాలీవుడ్ స్టార్ హీరోతో చేయబోతునట్టుగాఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

గౌతమ్ తిన్ననూరి ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. జెర్సీ మూవీ విడుదలకు ముందే వీరి మీటింగ్ జరిగినట్లు టాక్ వినపడుతుంది. అతడి వద్ద ఉన్న కథను ఎన్టీఆర్‌కు చెప్పినట్టు తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి చెప్పిన లైన్ విన్న ఎన్టీఆర్ తన సుముఖత వ్యక్తం చేశాడని, పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే కాక, గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్‌ను కూడా కలవబోతున్నట్లు, చాలా రోజుల క్రితం రాసుకున్న పీరియడ్ డ్రామాను అతడికి చెప్పబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ కాలికి గాయం కావడం వల్ల ఇంటి వద్దే ఉన్నాడు. చరణ్ ని కలిసి కథ చెప్పేలా ఎన్వీ ప్రసాద్ మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాడని , మరో వారం రోజుల్లోనే చరణ్ ని కూడా కలిసి కథ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీలో నటిస్తున్నారు. చరణ్‌కు గాయం కావడంతో షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాతో నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరిలో ఎవరితో గౌతమ్ ముందుగా తన చిత్రాన్ని తెరకెక్కిస్తాడో..