కమల్ హాసన్ ఇంటికి హోం క్వారంటైన్ స్టిక్కర్.. కంగారుపడిన కమల్ అభిమానులు

4:01 pm, Sat, 28 March 20

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్‌లో ఉన్నారన్న వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అధికారులు కమల్ ఇంటికి హోం క్వారంటైన్ స్టిక్కర్ అతికించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

చదవండి: డేంజర్ బెల్స్: ‘కరోనా’లోనూ అగ్ర స్థానమే… అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు!

విషయం తెలిసిన కమల్.. తనకేమీ కాలేదని, ఆందోళన చెందొద్దని అభిమానులను కోరాడు. ఆ తర్వాత అధికారులు కమల్ ఇంటికి అతికించిన హోం క్వారంటైన్ స్కిక్టర్‌ని తొలగించారు.

అసలేం జరిగిందంటే..

చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లోని కమల్ ఇంటికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించారు.

ఆ తర్వాత కాసేపటికి ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానులకు చేరిపోయింది. హోం క్వారంటైన్ స్టిక్కర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో తమ హీరోకు ఏమైందోనని అభిమానులు ఆవేదన చెందారు. విషయం కమల్ వరకు చేరడంతో ఆయన స్పందించారు.

తన ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల తాను క్వారంటైన్‌లో ఉన్నానన్న వార్త ప్రచారమైందని, అయితే అలాంటిదేమీ లేదని కమల్ తేల్చి చెప్పాడు.

చదవండి: చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!

కొన్నేళ్లుగా తాను ఆ ఇంట్లో ఉండడం లేదని, ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నట్టు చెప్పాడు.

కాబట్టి, తాను క్వారంటైన్‌లో ఉన్నానని వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టిపడేశాడు. ముందు జాగ్రత్తగా చర్యగా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ తెలిపాడు. అంతేకాదు, ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశాడు.