ఆ ఘనత దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా ‘మహానటి’…

11:52 am, Sat, 4 May 19
Mahanati Has Been Selected For The Prestigious film festival

 

హైదరాబాద్: అలనాటి అందాల తార.. మహానటి సావిత్రి గారి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విమర్శకుల నుండి కూడా ప్రశంశలు అందుకుని అఖండ విజయాన్ని అందుకున్న ‘మహానటి’ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది.

22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఎఫ్)కు ఎంపికై మెయిన్‌ల్యాండ్ చైనాలో ప్రదర్శనకు సిద్ధమైంది. అయితే ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్‌కు ఎన్నికైన తొలి భారతీయ చిత్రం మహానటి కావడం విశేషం.

‘ఇంటర్నేషనల్ పనోరమ’ విభాగంలో ఎంపికైన ‘మహానటి’ ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డుకెక్కి మరో ఘనత అందుకుంది.

ఈ చిత్రం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సావిత్రి గారి వేషధారణలో కనిపించిన కీర్తి సురేష్ గురించే మాట్లాడుకోవాలి. కీర్తి ఆ పాత్రలో నటించి.. కాదు కాదు జీవించి.. ‘మహానటి’ పాత్రకే వన్నె తెచ్చిన వైనం అందరినీ కట్టిపడేసింది.

ఇక దుల్కర్ సల్మాన్‌తో సహా మిగతా నటీ నటులంతా తమదైన శైలిలో వారి వారి పాత్రలకు న్యాయం చేస్తూ చక్కగా ఇమిడిపోయి నటించి మెప్పించారు.

వైజ‌యంతీ మూవీస్‌- స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ఇంత మంచి చిత్రానికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం.

చదవండి:కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న మహర్షి……