మహేష్ కి హాలీవుడ్ హీరో ఆహ్వానం!

12:30 pm, Mon, 29 April 19
Mahesh Babu Latest News, Tollywood Latest Movie News, Avengers News, Newsxpressonline

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే అందరూ బాలీవుడ్‌ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు.

దీనికి ప్రధాన కారణం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, శంకర్ తెరకెక్కించిన 2.ఓ వంటి మెగా బడ్జెట్‌ సినిమాలు, విశారణై వంటి కంటెంట్‌ ఉన్న సినిమాల తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది.

ఇటీవల అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ డైరెక్టర్‌ జో రుసో కూడా దక్షిణాది గురించి మాట్లాడారు. శంకర్‌ తెరకెక్కించిన రోబో సినిమా స్ఫూర్తితో అవెంజర్స్‌: ది ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రన్‌ సినిమాను తీసినట్లు చెప్పారు. హాలీవుడ్ లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా పేర్కొనే ప్రిడేటర్, ఎక్స్ మెన్ చిత్రాల్లో నటించిన బిల్ డ్యూక్ , టాలీవుడ్ స్టార్స్‌ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

అన్నీ కుదిరితే ఓ అంతర్జాతీయ స్పై సినిమా తీద్దామంటూ వారిని లంచ్‌కు ఆహ్వానించారు. అలాగే మహిళల అక్షరాస్యత అభివృద్ధి విషయంలో అంతర్జాతీయ కార్యక్రమాల ఏర్పాటు గురించి చర్చిద్దామని ఐశ్వర్య ధనుష్‌కు బిల్‌ చెప్పారు. ఐశ్వర్యను 2016లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెల్స్‌)లో దిగి, భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం అని బిల్‌ ట్వీట్ చేశారు. ఇదే విధంగా మరో ట్వీట్‌లో ఎ.ఆర్‌.మురుగదాస్‌, మహేశ్‌బాబులను చర్చలకు ఆహ్వానించారు.

ఓ హాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ను ఆహ్వానించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. దీనిని బట్టి చూస్తే మహేశ్ బాబు ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది అని చెప్పవచ్చు. ఈ ట్వీట్ మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చదవండి:  త్రివిక్రమ్ మూవీలో సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపించనున్న బన్నీ