సినీ కార్మికులను ఆదుకునేందుకు.. సీసీసీని ఏర్పాటు చేసిన చిరంజీవి

8:09 pm, Sat, 28 March 20

హైదరాబాద్: ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం మెగాస్టార్ చిరంజీవి  కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం (సీసీసీ) అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ వెల్లడించారు.

తొలుత తమ్మారెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టిస్తున్న క‌ల‌క‌లం మ‌నంద‌రం ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నామన్నారు.

ఈ వైరస్ కారణంగా సినీ ప‌రిశ్ర‌మలోని కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారిని ఆదుకునేందుకు పరిశ్రమలోని ప్రతి ఒక్కరు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారన్నారు.

వారిని మరింత ఆదుకునేందుకు చిరంజీవి ఓ గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సురేష్‌బాబు, తాను, ఎన్‌.శంక‌ర్, క‌ల్యాణ్, దాము తదితరులం కలిసి చిన్న క‌మిటీగా ఏర్పాటై సీసీసీ అనే సంస్థను ప్రారంభించినట్టు తెలిపారు.

ఈ సంస్థ ద్వారా సినీ కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా చిరంజీవి తొలుత కోటి రూపాయలు ప్రకటించినట్టు తెలిపారు. నాగార్జున రూ. కోటి, ఎన్టీఆర్ రూ.25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించినట్టు వివరించారు. 

ఎన్ శంకర్ మాట్లాడుతూ.. సీసీసీ సంస్థకు చిరంజీవి చైర్మన్‌గా ఉంటారని అన్నారు.  స‌భ్యులుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సురేష్ బాబు, సి.కల్యాణ్, దాము, బెన‌ర్జీ, తాను ఉంటామని తెలిపారు.