ఆసుపత్రి నుంచి మురళీమోహన్ డిశ్చార్జ్.. పరామర్శించిన చిరంజీవి

1:33 pm, Sat, 1 June 19

హైదరాబాద్: స్వల్ప అస్వస్థతకు గురై వారం రోజులపాటు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్‌ను మరో ప్రముఖ నటుడు చిరంజీవి పరామర్శించారు. తన తల్లి అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసేందుకు గత నెల 14న మురళీ మోహన్ వారణాసి వెళ్లారు.

నదిలో అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయనను కేర్ ఆసుపత్రిలో చేర్చారు. మురళీ మోహన్‌ను పరామర్శించిన వైద్యులు వెన్నెముకకు స్వల్పగాయం అయినట్టు నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు మురళీ మోహన్ ఆపరేషన్ చేయించుకున్నారు.

మురళీ మోహన్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి

వారం పాటు ఆసుపత్రిలో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. విషయం తెలిసిన చిరంజీవి భార్యతో కలిసి మురళీ మోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని మురళీ మోహన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. త్వరలోనే రాజమండ్రి వచ్చి ప్రజలను కలుస్తానన్నారు.