డైరెక్టర్స్ సంఘానికి మెగాస్టార్ భారీ విరాళం!

9:31 am, Sun, 5 May 19
megastar

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు చిరంజీవి మరోమారు పెద్దమనసు చాటుకున్నారు. తనను ఇంత పెద్ద నటుడిని చేసిన చిత్రపరిశ్రమ కోసం పెద్ద ఎత్తున విరాళాన్ని ప్రకటించారు.

దర్శకుల సంఘానికి రూ.25 లక్షల విరాళం అందిస్తున్నట్టు చెప్పారు. దాసరి నారాయణరావు జన్మదినమైన మే 4ను డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి హైదారాబాద్‌లోని ఫిలించాంబర్‌లో దాసరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, నటీనటులు, దాదాపు 300 మంది దర్శకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లంకేశ్వరుడితో తనకు దాసరితో పరిచయం అయిందన్నారు. ఆయనతో కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఇద్దరి మధ్య దగ్గరి బంధుత్వం ఉందన్నారు. ఆ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసన్న చిరంజీవి దాసరి తనకు తాత అవుతారన్నారు.

దర్శకుల సంఘానికి తనవంతు సాయంగా రూ.25 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అనంతరం దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్‌ మాట్లాడుతూ.. ఈ వేదికపై మొత్తంగా కోటి రూపాయల విరాళం అందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.