ఎంపీగా గెలిచినా ‘జబర్దస్త్’ చేస్తూనే ఉంటా: నాగబాబు

12:30 pm, Mon, 15 April 19
naga-babu

హైదరాబాద్: ఈటీవీలో అత్యధిక రేటింగుతో కొన్నేళ్లుగా ‘జబర్దస్త్’ కామెడీ షో కొనసాగుతోంది. ఈ కామెడీ షోకి న్యాయనిర్ణేతలుగా నాగబాబు – రోజా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో వుంది.

ఈ నేపథ్యంలోనే నాగబాబు .. ‘జనసేన’ పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో రాజాకీయాలపైనే నాగబాబు దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్’ షోలో పాల్గొనక పోవచ్చునని ప్రచారం జరుగుతోంది.

‘‘’జబర్దస్త్’ చేస్తూనే ఉంటా..’’

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. జబర్దస్త్..  అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నెలకి నాలుగు రోజులు మాత్రమే జబర్దస్త్ షూటింగ్ ఉంటుందని, ఆ నాలుగు రోజులు ఎలాగో అలా తాను సర్దుబాటు చేసుకుంటానని పేర్కొన్నారు.

‘‘ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ జబర్దస్త్ షో చేయడం మాత్రం మానుకోను, దానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే ఉన్నారు..’’ అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.