పండుగ సాయన్నగా పవన్.. మరుగునపడిన వీరుడి కథలో జనసేనాని!

12:41 pm, Mon, 10 February 20

హైదరాబాద్: అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితమైన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా పవన్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు అంగీకరించారు. మరో మూడు సినిమాలను లైన్లో పెట్టారు. పవన్ రీఎంట్రీ మూవీ ‘పింక్’ రీమేక్ ఇప్పటికే మొదలైంది.

క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాని ఒకే చేశారు. ఇది పవన్‌కి 27వ సినిమా. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కథ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న జీవిత కథ అని సమాచారం.

నేటితరం వారికి పండుగ సాయన్న పెద్దగా తెలియకపోవచ్చు. చరిత్రలో మరుగునపడిన వీరుడు పండుగ సాయన్న. మహబూబ్‌నగర్‌లో 150 ఏళ్ల క్రితం ఆకలితో అలమటించే పేద ప్రజల కోసం పండుగ సాయన్న చాలా పోరాడారు. సంపన్నుల ఇళ్లపై దాడి చేసి ధాన్యం బస్తాలు ఎత్తుకెళ్లి పేద వర్గాలకు పంచిపెట్టేవాడు. దీనితో ఆయన అంటే ప్రజలలో ఓ దేవుడు అనే నమ్మకం కలిగింది.

ఇదంతా చూస్తూ భూస్వాములు భరించలేకపోయారు. సాయన్నను ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా చిత్రించారు. నిజాం ప్రభుత్వ సాయంతో చంపించారు. అందుకే పవన్ కూడా గడ్డం లుక్ నుంచి బయటకి వచ్చి కోరమీసాలు ఉన్న లుక్ తో కనిపించారు. దీంతో పవన్ చేయబోయే కథ ఇదేనని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీని తీసి అందరిచేత శభాష్ అనిపించుకున్న క్రిష్ ఈ కథని చేస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆ తర్వాత డాలీ, బాబీ, త్రివిక్రమ్ లతో పవన్ వరుస సినిమాలు చేయనున్నారు.