బాలీవుడ్‌లో నరనరానా అదే.. నన్నూ దూరం పెట్టారు.. ఎంతో కుంగిపోయా: పాయల్ రాజ్‌పుత్

- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్‌ నరనరానా బంధుప్రీతి నిండిపోయి ఉందని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ వ్యాఖ్యానించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

బాలీవుడ్ ప్రముఖుల గురించి సుశాంత్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూను చూసిన పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్పందించారు. 

‘‘నా మైండ్‌లో ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. వాటిని మీతో ఎలా పంచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు..’’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, చిత్రపరిశ్రమలో చీకటి కోణం కూడా ఉందన్నారు. అసలు మొదటిది నెపోటిజం.. అంటే బంధుప్రీతి.. ఇది బాలీవుడ్ నరనరాల్లో ఇంకిపోయిందని పాయల్ చెప్పారు. 

ఇక రెండోది.. ఇదొక ఆట.. అదృష్టం కలిసిరావాలి అంటారని, మూడోదిగా మనుషుల్లో లేనిపోని అభద్రతా భావం కల్పిస్తారని వివరించారు. 

బాలీవుడ్‌లో తననూ కొందరు దూరం పెట్టారని పాయల్ రాజ్‌పుత్ వ్యాఖ్యానించారు. ‘నువ్వు దీనికి సరిపోవు..’ అనే వారని చెప్పారు.

‘‘నా స్థానంలో మరొకరిని ఎంపిక చేసుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. ఎంతో కుంగిపోయాను. అయితే ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు..’’ అంటూ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారామె. 

మనుషులకు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని పాయల్ చెప్పారు. మన మనసులోని బాధలను ఇతరులతో పంచుకోవడం కొన్నిసార్లు కష్టమేనన్నారు.

అయితే మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోమా? ఇదీ అంతే.. అన్నిటికంటే జీవితం అమూల్యమైంది.. దాన్ని మధ్యలోనే చాలించరాదని సూచించారు.

జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని, కొన్నిసార్లు మనకు పరిస్థితులు కలిసిరావని, అయినా పర్వాలేదు.. ప్రపంచంలో ఏ మనిషి ప్రతిరోజూ సంతోషంగా ఉండలేడు, ఒకవేళ అలా ఉంటే అతడు మనిషే కాడు అనేశారు. 

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌గా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫొటో పెట్టుకున్న పాయల్.. బాలీవుడ్‌లో బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా రౌనత్‌కు థ్యాంక్స్ చెప్పారు.

మంచీ చెడు రెండూ అనుభవించక తప్పదు.. చెడు రోజులను తలుచుకుని కుమిలిపోవద్దు.. బాధ కలిగితే దాచుకోవద్దు, గట్టిగా ఏడ్చేయండి.. మనసు తేలికచేసుకోండి అని సూచించారు. 

మానసిక ఒత్తిడి అనుభవించే సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలని, మనసులోని దు:ఖాన్ని వారితో పంచుకుంటే కష్టం తీరిపోతుందని పాయల్ చెప్పారు. 

- Advertisement -