హీరో రాజశేఖర్ కారులో మద్యం సీసాలు.. కారు వేగం 180 కిలోమీటర్లు!

9:02 pm, Wed, 13 November 19

హైదరాబాద్: ప్రమాదానికి గురైన టాలీవుడ్ నటుడు రాజశేఖర్ కారు నుంచి పోలీసులు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వెళుతుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డు పెద్ద గోల్కొండ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురైంది.

ఈ ప్ర‌మాదం నుంచి రాజ‌శేఖ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారుని సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

కారులో మ‌ద్యం సీసాలు ఉండ‌డాన్ని వారు గ‌మ‌నించారు. అంతేకాదు, ఆ సమయంలో వంద కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లాల్సిన కారు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కారుపై ఇప్ప‌టికే మూడు ఓవర్ స్పీడ్ చలానాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది‌. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో రెండు చలానాలు ఉన్నాయి.

మూడువేల రూపాయల జరిమానా పెండింగ్‌లో ఉందని పోలీసులు అంటున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.