టాలీవుడ్ నిర్మాత తనయుడిపై పోలీసుల దాడి, ఆపైన క్షమాపణ! అసలేం జరిగిందంటే…

10:16 am, Wed, 1 January 20

హైదరాబాద్: డయల్ 100కు ఫోన్ చేసిన టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ తనయుడిపై పంజాగుట్ట పోలీసులు దాడిచేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలిసిన నట్టి కుమార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు క్షమాపణలు చెప్పారు.

ఇంతకీ ఏం జరిగిందటే.. బేగంపేటలోని కంట్రీక్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నట్టికుమార్ తనయుడు క్రాంతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. కారు పార్కింగ్ చేస్తామంటూ ఆయన దగ్గర తాళాలు తీసుకుని ఇవ్వలేదు. దీంతో క్రాంతి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

‘‘100‌కు డయల్ చేస్తే.. కొడతారా?’’

అయితే, కంట్రీక్లబ్‌కు చేరుకున్నపోలీసులు నేరుగా క్రాంతి వద్దకు వెళ్లి డయల్ 100కు ఎందుకు ఫోన్ చేశావంటూ అతడిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న నట్టి కుమార్ నేరుగా పంజగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. డయల్ 100కు ఫోన్ చేస్తే కొడతారా? అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమారుడి మెడ పట్టుకుని, గొంతు నులిమి దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక దశలో పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో దిగొచ్చిన పోలీసులు క్షమాపణలు చెప్పడంతో ఆయన శాంతించారు.