చైనాలో రజనీకాంత్ ‘2.0’ విడుదల.. డ్రాగన్ కంట్రీలో రికార్డు సృష్టిస్తుందా?

12:39 pm, Fri, 6 September 19

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘2.0’ సినిమా శుక్రవారం చైనాలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో గతేడాది భారత్‌లో విడుదలైంది.

అప్పుడే చైనాలోని 48 వేల థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. అయితే, అదే సమయంలో ‘ద లయన్ కింగ్’ విడుదల కావడంతో ‘2.0’ సినిమా విడుదలను వాయిదా వేశారు.

దీంతో నేడు ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. చైనాలో ఈ సినిమా గత రికార్డులను తిరగరాస్తుందని లైకా సంస్థ పేర్కొంది.

రజనీకాంత్ ఈ సినిమాలో చిట్టి, వశీకరణ్ పాత్రల్లో కనిపించాడు. 2010లో వచ్చిన ‘రోబో’ సినిమాకు ఇది కొనసాగింపు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం సమకూర్చాడు.

విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడు. హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటించింది.