15 ఏళ్ల కల నెరవేరింది: సూపర్‌స్టార్ రజనీకాంత్

7:22 am, Sat, 4 January 20
హైదరాబాద్: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆదిత్య అరుణాచలంగా రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.
 
కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్షకుల‌కు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్‌వీ ప్రసాద్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జ‌న‌వ‌రి 9న తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
 
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. మురుగ‌దాస్‌తో ప‌నిచేయాలన్న కోరిక 15 ఏళ్లకు తీరిందన్నారు. సినిమాలంటే పాషన్ ఉన్న నిర్మాత సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారని అన్నారు.  ఈ సినిమాలో తాను ఆదిత్య అరుణాచ‌లం అనే పోలీస్ అధికారి పాత్రలో నటించినట్టు తెలిపారు. ఈ క‌థ‌ను వింటే హీరో, నిర్మాత ఈ సినిమాను ఎలా చేశారా? అని ఆశ్చర్యపోతారని అన్నారు. 
 
అయితే, మురుగ‌దాస్‌ ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని రజనీకాంత్ ప్రశంసించారు. కెమెరామెన్ సంతోశ్ శివ‌న్‌, అనిరుధ్‌లు తమ మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచారని కొనియాడారు. రామ్ ల‌క్ష్మణ్‌ అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారన్నారు. తిరుప‌తి ప్రసాద్‌ తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్నట్టు చెప్పారు.
 
ద‌ర్బార్ సినిమా క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుందన్నారు. తాను 168 సినిమాలు చేసినా ఇది చాలా భిన్నమైన మూవీ అన్నారు. ఇది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ అని తెలిపారు. సునీల్ శెట్టి స‌హా అంద‌రూ చ‌క్కగా న‌టించారని రజనీకాంత్ ప్రశంసించారు.