ముమ్మాటికీ ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యే: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శక నిర్మాతలు ఫైర్…

2:11 pm, Mon, 29 April 19
ram-gopal-varma

హైదరాబాద్: తన సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు తాను ఆదివారం విజయవాడలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేస్తే.. అందులో పోలీసులకున్న అభ్యంతరం ఏమిటో తనకు అర్థం కాలేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ప్రెస్‌మీట్‌ కోసం తాను విజయవాడ వెళితే.. తనను అరెస్టు చేసి.. నగరం విడిచి పెట్టి వెళ్లాలని పోలీసులు కోరారని, కానీ ఎందుకంటే మాత్రం సమాధానం చెప్పడం లేదంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో సోమవారం వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విజయవాడలో తాను ఉండడానికి వీలులేదని పోలీసులు బెదిరించడం చూస్తుంటే.. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? అని అనిపించిందని, విజయవాడ ఏమైనా వేరే దేశమా? అని వర్మ ప్రశ్నించారు.

జగన్‌ మీద దాడి జరిగితే పోలీసులు కనీసం ఎయిర్‌ పోర్టుకు రాలేదని, కానీ తనను మాత్రం ఎయిర్‌ పోర్టులోనే అరెస్టు చేశారని ఆరోపించారు. నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగమేననన్నారు. అయితే తాము ఇలాంటి వాటికి భయపడే మనుషులం కాదని ఆయన తేల్చి చెప్పారు.