దుమ్మురేపిన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్

7:05 am, Mon, 6 January 20

హైదరాబాద్: ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన మహేశ్ హ్యాట్రిక్ కొట్టేందుకు సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఎఫ్2‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్, రష్మిక జంటగా లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎఫ్2 సినిమాలో ‘అంతేగా.. అంతేగా’ అనే డైలాగ్‌తో నవ్వులు పూయించిన దర్శకుడు ఈ సినిమాలో కూడా రష్మికతో ‘నీకు అర్థమవుతోందా..?’ అని ముద్దుముద్దుగా చెప్పించిన డైలాగ్‌తోపాటు ‘పదిహేను సంవత్సరాల ప్రొఫెషనల్ కెరియర్ ఇంతవరకు తప్పును రైట్ అని కొట్టలేదు’ అని వార్నింగ్ ఇస్తూ విజయశాంతి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.

బండ్ల గణేష్ మెడలో బ్లేడ్ చైన్ వేసిన అనిల్ ప్రేక్షకులకు బండ్ల నుంచి కావాల్సిందేంటో చెప్పకనే చెప్పేశాడు. ‘ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అంటూ రష్మిక అండ్ టీం చెప్పిన డైలాగ్‌తో సినిమాలో ఉన్న వినోదం రేంజ్ ఏంటో తేలిపోయింది. పవర్‌ఫుల్ పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి ఆకట్టుకున్నారు. ‘చిన్న బ్రేక్ ఇస్తన్నాను.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ అని ట్రైలర్ చివరలో మహేశ్ చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారని చెప్పడంలో సందేహం లేదు.

మొత్తం మీద ట్రైలర్ చూశాక పూర్తిగా వినోదాన్ని రంగరించి తెరకెక్కించిన మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ అని స్పష్టమైంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది.