వేణుమాధవ్ మృతితో దిగ్భ్రాంతికి లోనైన టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్

7:58 am, Fri, 27 September 19

హైదరాబాద్: టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.  ‘‘వేణు మాధవ్ మరణం గురించి తెలిసి షాక్ అయ్యాను. వెండితెరపై నేను చూసిన మంచి కమెడియన్లలో ఆయన ఒకరు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ పఠాన్ ట్వీట్ చేశాడు.

వేణు మాధవ్ గురించి యూసుఫ్ పఠాన్ ట్వీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ‘వేణు మాధవ్ మీకు ఎలా తెలుసు సార్?’ అంటూ ఫాలొవర్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ‘హిందీ డబ్బింగ్ సినిమాల్లో చూసి ఫ్యాన్ అయ్యారా సార్?’ అని ప్రశ్నిస్తున్నారు.

 వేణుమాధవ్ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.

వేణు మాధవ్ అకస్మాత్తుగా మృతి చెందడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే వేణుమాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.