నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. వాటిపై సినిమా తియ్: వర్మకు దివ్యవాణి సవాల్

5:16 pm, Tue, 30 April 19
divya-vani-ramgopal-varma

అమరావతి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి మంగళవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రామ్ గోపాల్ వర్మకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే.. వైఎస్ జగన్ కుటుంబంలో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయాలంటూ సవాల్ విసిరారు.

నా కన్నా చంద్రబాబు పెద్ద రౌడీ అంటూ వర్మ మాట్లాడడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘‘అయ్యా వర్మా.. నీ స్థాయికి దేవీబాబు లాంటి వ్యక్తే ఎక్కువ. నువ్వా చంద్రబాబునాయుడి గురించి మాట్లాడేది?’’ అంటూ ఎద్దేవా చేశారు. అనవసరంగా తమ పార్టీ అధినేత గురించి ఒక్క మాట కూడా ఎక్కవ మాట్లాడొద్దంటూ ఆమె రామ్ గోపాల్ వర్మను వార్నింగ్ ఇచ్చారు.

‘‘చంద్రబాబు గురించా నువ్వు మాట్లాడేది..’’

చంద్రబాబునాయుడిని పక్క రాష్ట్రాల వాళ్లు కూడా ఎంతో గౌరవిస్తారని, పొరుగు రాష్ట్రాల వాళ్లు కూడా యూట్యూబ్‌లో ఆయన గురించి గొప్పగా వీడియోలు పెడుతున్నారని, మీకొద్దంటే చెప్పండి.. బాబును మేం తీసుకెళతాం అని అంటున్నారని, అలాంటి చంద్రబాబునాయుడి గురించా నువ్వు మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు నాయుడుగారి విలువేంటో ఇవ్వాళ తెలుస్తోంది తెలంగాణ ప్రజలకు అని దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఇరవై మంది ఇంటర్మీడియెట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును, వారి తల్లిదండ్రుల సంతోషాన్ని మళ్లీ తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నించారు. ‘‘ఓ వైపు ఏపీలో 144 సెక్షన్ అమల్లో ఉంటే నువ్వేంటి ఇక్కడకొచ్చి మాట్లాడేది?” అంటూ దివ్యవాణి వర్మపై నిప్పులు చెరిగారు.

అంతేకాదు, ‘‘తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఎంత మంది బిడ్డలు ఆహుతైపోయారు? మరి వాటిపై నీకు సినిమాలు తీసే దమ్ము, ధైర్యం ఉన్నాయా? ఇలాంటి ఘటనలపై సినిమాలు తీస్తే నిన్ను నిజమైన డైరెక్టర్ అంటాం. సినీ దర్శకుడు అంటే ఎలా ఉండాలో.. ఇండస్ట్రీలో ఉన్న అగ్రశ్రేణి దర్శకులను చూసి నేర్చుకోండి..’’ అంటూ హితవు పలికారు.