రాజశేఖర్ కారు ప్రమాదంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చిన జీవిత

8:20 pm, Wed, 13 November 19

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ‌శేఖ‌ర్ గత రాత్రి పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయన కారు ప్ర‌మాదానికి గురి కాగా, ఆ స‌మ‌యంలో మూడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావ‌డంతో స్వ‌ల్ప గాయాల‌తో బయటపడ్డారు. వెంట‌నే మ‌రో కారులో త‌న ఇంటికి చేరుకున్నారు.

రాజశేఖ‌ర్ కారు ప్ర‌మాదంపై ఆయ‌న భార్య జీవిత వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదని అన్నారు. ఆర్ఎఫ్‌సీ నుంచి వ‌స్తున్న స‌మ‌యంలో కారు టైరు ఒక్కసారిగా పేలడం వల్ల కారు డివైడ‌ర్‌ని ఢీకొని ప‌క్క‌కి వెళ్లిందన్నారు.

వెనుక వ‌స్తున్న వారు గ‌మనించి రాజ‌శేఖ‌ర్‌ని కారులో నుంచి బ‌య‌ట‌కి తీశారని వివరించారు. రాజ‌శేఖ‌ర్ ఫోన్ స్విచ్చాఫ్ కావ‌డం వ‌ల్ల త‌న‌ని రక్షించిన వారి ఫోన్ నుంచి పోలీసులకి ఫోన్ చేసి స‌మాచారం అందించినట్టు జీవిత వివరించారు. ఆ త‌ర్వాత తమకు చెప్పడంతో వెళ్లినట్టు చెప్పారు.

ఆ తర్వాత రాజశేఖర్‌ను ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందించినట్టు చెప్పారు. పోలీసుల‌తో టచ్‌లోనే ఉన్నామని, వారికి అన్ని విషయాలు చెప్పామని పేర్కొన్నారు. కోలుకున్న త‌ర్వాత స్టేష‌న్‌కి వ‌చ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాల‌ని తమతో చెప్పారన్నారు.

పెద్ద ప్రమాదమే అయిన‌ప్ప‌టికీ అభిమానుల ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగాల వల్ల రాజ‌శేఖ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారని, అందరికీ ధన్యవాదాలని జీవిత పేర్కొన్నారు.