చిరంజీవిని‘రాజ్యసభ’కు పంపబోతున్నట్టు ప్రచారం.. స్పందించిన నాగబాబు

10:47 am, Thu, 5 March 20

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవికి ఓ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరుడు నాగబాబు స్పందించారు.

ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్లినా గొప్ప స్వాగతం లభిస్తుందని, రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మెగా అభిమానుల్లో గందగోళం సృష్టించేందుకు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ దుయ్యబట్టారు.

చిరంజీవి తన జీవితాన్ని తిరిగి సినీ రంగానికే అంకితం చేశారన్న నాగబాబు.. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరన్నారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా సినిమాలపైనే ఉందన్నారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి మరో సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.

తమ కుటుంబంలోని మిగతా నటుల కంటే చిరంజీవే ప్రస్తుతం బిజీగా ఉన్నారని నాగబాబు పేర్కొన్నారు.