నాకేం కాలేదు.. క్షేమంగా ఉన్నా: రాజశేఖర్

9:16 pm, Wed, 13 November 19

హైదరాబాద్: రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని అభిమానులకు తెలియజేశారు.

తనకు పెద్దగా గాయాలు కాలేదని, బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద నా కారు ప్ర‌మాదానికి గురైందని రాజశేఖర్ తెలిపారు.

ఆ సమయంలో కారులో తానొక్కడినే ఉన్నానని, ఎదురుగా వ‌స్తున్న కారులోని వారు గమనించి తనను గుర్తుపట్టారని అన్నారు. లోపల చిక్కుకున్న తనను బయటకు లాగారని గుర్తు చేసుకున్నారు.

వారి నుంచి ఫోన్ తీసుకుని తొలుత పోలీసులకు, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారి కారులోనే తాను ఇంటికి బ‌య‌లుదేరినట్టు వివరించారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

కాగా, రాజశేఖర్ ప్ర‌స్తుతం క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకుడు.