గుండెపోటుతో కన్నుమూసిన టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు

- Advertisement -

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు (88) గుండె పోటుతో ఈ రోజు కన్నుమూశారు.  గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

చేయి తిరిగిన రచయితగా గుర్తింపు ఉన్న రావి కొండలరావు నటుడిగా అనేక చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు. దాదాపు 600 సినిమాల్లో నటించారు.

- Advertisement -

నాటి సూపర్ హిట్లయిన దసరా బుల్లోడు, తేనె మనసులు సినిమాల నుంచి ఇటీవలి కింగ్, వరుడు, ఓయ్ వంటి చిత్రాల్లోనూ ఆయన నటించారు. గతంలో భైరవద్వీపం, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు సహనిర్మాతగానూ వ్యవహరించారు.

రావి కొండలరావు అర్ధాంగి రాధా కుమారి కూడా తెలుగు నటిగా సుపరిచితురాలు. ఆమె ఎనిమిదేళ్ల కిందటే కన్నుమూశారు. రావికొండలరావు మృతి వార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణం సినీ, నాటక రంగాలకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932లో జన్మించిన రావి కొండలరావు.. సుకుమార్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు.

నాటికలు, నాటకాలు రచించారు. 2004లో ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది.

భైరవద్వీపం, బృందావనం చిత్రాలకు సంభాషణలు, పెళ్ళి పుస్తకం చిత్రానికి కథ అందించారు. తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

- Advertisement -