చదువుకునే రోజుల్లో మహేశ్ బాబు అనే వాళ్లం! ఇప్పుడు సార్ అనాల్సివస్తుంది: విజయదేవరకొండ

8:28 am, Thu, 2 May 19
vijadevarakonda

హైదరాబాద్: మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహర్షి చిత్ర బృందంతో పాటు సీనియర్ హీరో వెంకటేశ్, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, కాలేజ్ డేస్ నుంచి తాను మహేశ్ బాబు ఫ్యాన్ అని చెప్పారు. ఇంటర్ లో ఉన్నప్పుడు మహేశ్ బాబు అనేవాడ్నని, కానీ హీరో అయ్యాక మహేశ్ బాబును సర్ అని పిలవాల్సి వస్తోందని తెలిపారు. తెలియకుండానే ఆ గౌరవం వచ్చేస్తోందని అన్నారు.

అయినప్పటికీ మధ్య మధ్యలో ఒక్కోసారి మహేశ్ బాబు అని అలవాటుగా అనేస్తుంటానని వెల్లడించారు. ఓసారి తన తల్లిదండ్రులతో కలసి మహేశ్ బాబు సినిమా చూసేందుకు దిల్ సుఖ్ నగర్, కోణార్క్ థియేటర్ కు వెళితే టికెట్లు దొరకలేదని చెప్పారు.

అప్పట్నించి అమ్మాయిల క్యూలోకి ఎవర్నయినా తెలిసిన అమ్మాయిలను పంపించి టికెట్లు సంపాదించే తెలివితేటలు అలవర్చుకున్నానని అన్నారు. కాగా, విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నంత సేపు వేదికపై ఉన్న మహేశ్ బాబుతో పాటు పలువురు హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు.