నటుడు రావి కొండలరావు మృతికి జగన్, చంద్రబాబు సంతాపం

8:36 pm, Tue, 28 July 20
jagan-chandrababu-on-ravikondalarao-death

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 

తెలుగు సినీ ప్రముఖుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, పాత్రికేయుడిగా చెరగని ముద్రవేశారని  సీఎం జగన్ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు.

రావికొండలరావు మృతికి సంతాపం తెలిపిన సీఎం ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రావి కొండలరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటులు, రచయిత కళాప్రపూర్ణ రావి కొండలరావు మరణం విచారకరమని అని ట్వీట్ చేశారు.

తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

కాగా,  రావి కొండలరావు (88) ఈ రోజు కన్నుమూశారు.  గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

చేయి తిరిగిన రచయితగా గుర్తింపు ఉన్న రావి కొండలరావు నటుడిగా అనేక చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు. దాదాపు 600 సినిమాల్లో నటించారు.