కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం.. పది నెలల పసికందు మృతి…

7:49 pm, Mon, 8 June 20

న్యూఢిల్లీ: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వెనకా ముందూ చూసుకోకుండా కారు రివర్స్ చేయడంతో ఓ ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాలు కోల్పోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తూ కారు కింద పడి పది నెలల పసికందు మరణించింది. తిలక్ నగర్‌‌లోని స్థానిక అపార్ట్‌మెంట్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాకేష్‌ తన కుటుంబంతో సహా పార్కింగ్‌ ప్రాంతంలో ఉండే ఓ గదిలో నివసిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం అతడి పది నెలల కూతురు రాధిక తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఓ మెర్సిడెజ్ బెంజ్ కారు వెనక కూర్చుని ఆడుకుంటోంది.

అయితే చిన్నారిని గమనించని డ్రైవర్ కారును రివర్స్ చేశాడు. ఈ నేపథ్యంలో పాప కారు కింద పడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఈ ఘటనపై స్పందించిన స్థానిక డీసీపీ కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు తెలిపారు. కారు యజమాని జబీర్ సింగ్‌కు సమన్లు పంపామని, తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.