మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై చెయ్యేశాడు.. ఆమె ఏం చేసిందో తెలుసా?

11:55 am, Sat, 4 January 20
Man Arrested For Sexual Abuse Of Over 50 Women

హైదరాబాద్: రాత్రి 9 గంటల సమయం..  ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, పైగా గర్భవతి.. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో ఓ వ్యక్తి ఎదురయ్యాడు. అంతేకాదు, ఆమెపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

మరొకరైతే ఈ ఘటనకు హడలిపోయేవారే. కానీ ఆమె మాత్రం ధైర్యంగా ఆ వ్యక్తిని పట్టుకుని కుమ్మేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే…

సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. గురువారం రాత్రి విధుల్లో ఉండగా 9 గంటల సమయంలో భర్త ఆమెను కలుసుకునేందుకు వచ్చాడు.ఇద్దరూ కలిసి సమీపంలోని వైఎస్సార్ చౌరస్తాకు వెళ్లి భోజనం చేశారు.

ఒంటరిగా ఉందని అసభ్యంగా ప్రవర్తిస్తే…

అనంతరం భర్త వెళ్లిపోగా, ఆమె నడుచుకుంటూ కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన ఓ ఆగంతకుడు అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. షాకైన ఆమె తేరుకుని అతడి వంక చూడడంతో అతడు వెనక్కి వెళ్లిపోయాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని మహిళ అతడిని వెంబడించింది.

అతడిని పట్టుకుని నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన అతడు ఆమెపై దాడికి యత్నించాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని బాధితురాలు అతడిపై ఎదురుదాడికి దిగి పిడిగుద్దులు కురిపించింది. అదే సమయంలో గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు.

100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, ఆ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చూపిన చొరవ, తెగువను పోలీసులు ప్రశంసించారు.

అలాగే ఉండాలి మరి.. పేరుకే సాఫ్ట్‌వేర్.. ఎవరైనా టచ్ చేస్తే మాత్రం ‘హార్డ్‌వేర్’!