‘‘బట్టలు విప్పితేనే నటన నేర్పిస్తా’’: బయటపడ్డ మరో యాక్టింగ్ స్కూల్ గుట్టు!

achint-kaur-chadda-allgedly-complaining-in-a-press-conference
- Advertisement -

హైదరాబాద్: క్షుద్ర పూజలi నేర్చుకోవాలంటే ఉపాసకులు దిగంబరులుగా సాధన చేయాల్సిందేననే కొన్ని కథలు వింటుంటాం. కానీ, నటన నేర్చుకోవాలంటే కూడా బట్టలు విప్పేయాలా? నగ్నంగా నేర్చుకోవాలా? నగరంలో తాజాగా జరిగిన ఉదంతం ఒకటి లైంగిక వేధింపుల్లో మరో కోణాన్ని బయటపెడుతోంది.

బట్టలు విప్పితేనే నటన నేర్పుతానంటూ యువతుల్ని వేధిస్తున్న ఓ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది.  అచింత కౌర్ చద్దా అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌పై ఓ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 

ఈ ఘటన యావత్తు ఆ యువతి మాటల్లోనే…

హిమాయత్ నగర్‌లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ కు వినయ్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ మధ్యే నాతో సహా మరో ఎనిమిది మంది విద్యార్థులు ఈ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవడానికి చేరారు.

మాకు ఉదయం 6:30 నుంచి ఉదయం 9:30 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 16న వినయ్ వర్మ ఆధ్వర్యంలో యాక్టింగ్ తరగతులు నడుస్తున్నాయి. ఇంతలో తలుపులు, కిటికీలు అన్ని మూయమని చెప్పి అనంతరం ఒక్కొక్కరిగా అందరినీ బట్టలు విప్పమని చెప్పారు.

ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను బట్టలు తీయనని మా సర్‌కు చెప్పాను. ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ ఒక యువతి ఆయన చెప్పినట్టుగానే బట్టలు విప్పింది. మిగతా యువకులు కూడా అలాగే చేశారు అని చెప్పుకొచ్చింది.

ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన యువతి ‘షీ టీమ్’కు ఫిర్యాదు చేసింది. ఏసీపీ నర్మద, రామ్‌లాల్ నుంచి వెంటనే స్పందన వచ్చిందని యువతి చెప్పింది. అయితే ఏసీపీ సూచన మేరకు నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడి పోలీసులు సరిగా స్పందించలేదని వాపోయింది.

ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మద్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చిందని అచింత ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా జీవితంలో పోలీస్ స్టేషన్‌కు రావడం ఇదే తొలిసారి. అయితే పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం నన్ను తీవ్ర వేధనకు గురిచేసింది..’’ ఆమె పేర్కొంది.

‘‘నిజానికి చాలా వరకు నేరాలు పోలీసుల అలక్ష్యం వల్లే జరుగుతున్నాయేమో. నేరస్థులపై పోలీసులు వెంటనే చర్యలు ఎందుకు తీసుకోరో నాకర్థం కాదు. నిజాయితీ గల వ్యక్తుల పట్ల స్పందించకపోవడం కూడా నేరానికి మార్గం సుగమం చేయడమే..’’ అని అంకిత మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొంది.

- Advertisement -