హాజీపూర్ హత్యాచారాలు: సైకో శ్రీనివాస్ రెడ్డికి.. మరికొందరి సహకారం!?

9:55 pm, Sat, 4 May 19
congress leader nerella sarada comments on psycho srinivas reddy case

హాజీపూర్: యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కు చెందిన సైకో శ్రీనివాస్ రెడ్డి హత్యాచారాల కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వీడి చేతికి చిక్కిన అమ్మాయిలు అత్యంత కిరాతకంగా హతమార్చబడి బావిలో శవాలుగా తేలడంతో హాజీపూర్‌‌లో కలకలం రేగిన సంగతి తెలిసిందే.

అందరి ముందు మంచోడిలా నటిస్తూ.. తెరచాటున సైకో శ్రీనివాస్ రెడ్డి చేసిన అఘాయిత్యాలు ఒక్కసారిగా వెలుగులోకి  రావడంతో హాజీపూర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు.. తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

చదవండి: సైకో శ్రీనివాసుడి ప్రేమాయణం..!! అవాక్కవుతున్న పోలీసులు…

అయితే ఈ వరుస హత్యాచార ఘటనల్లో శ్రీనివాస్ రెడ్డికి మరికొందరు సాయం అందించారని, వారిని కూడా శిక్షించాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ళ శారద డీజీపీకి వినతిపత్రం సమర్పించడంతో.. ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ళ శారద నేరుగా హాజీపూర్ వెళ్లి ఈ అఘాయిత్యాల గురించి ఆరా తీశారు. సైకో శ్రీనివాస్ రెడ్డి బారిన పడిన ప్రాణం పోగొట్టుకున్న వారిలో 11 ఏళ్ల బాలిక కూడా ఉందనే విషయం తెలుసుకుని ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇది శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.

ఈ దారుణ అఘాయిత్యాల్లో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదని, ఇంకా మరికొందరి ప్రమేయం కూడా ఉందని ఆరోపించిన శారద .. అతనికి సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలి…’’

అంతేకాకుండా ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్  మహిళా సంఘాలు, పోలీసులతో చర్చించాలని కోరారు. శ్రావణి అనే అమ్మాయి కనపడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ సైకో గాడి అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా బయటకి వచ్చాయి.

శ్రావణి శవం బావిలో దొరకగా అదే బావిలో మనీషా అనే మరో అమ్మాయి మృతదేహం కూడా దొరకడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

ఎప్పుడో కనిపించకుండా పోయిన 6వ తరగతి బాలిక కల్పన అవశేషాలు కూడా అక్కడే దొరకడంతో ఆ సైకో గాడి శాడిజం ఊరి జనానికి తెలిసింది. ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు విచారిస్తున్నారు.

చదవండి: వీడొక ‘సైకో’: ముందు ఊపిరాడకుండా చేసి.. ఆపైన హత్యాచారాలు!