ప్రాణం తీసిన ఫీజు: మూడో అంతస్తుపైనుంచి దూకిన బీటెక్ విద్యార్థిని

2:47 pm, Sat, 30 March 19
Student Suicide News, Hyderabad Latest Crime News

హైదరాబాద్: ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆ విద్యార్థినికి పేదరికం అడ్డుపడింది. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు భారంగా మారాయి. దీంతో తన వేదనను అటు పేదలైన తల్లిదండ్రులకు చెప్పుకోలేక చివరకు ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఘటనపై చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ సైరెడ్డి వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రాజేంద్రప్రసాద్‌, మాధవి దంపతులు. ఐదేళ్ల నుంచి హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి బృందావన్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రాజేంద్రప్రసాద్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమార్తె సుస్మిత(21) ఘట్‌కేసర్‌లోని ఏస్‌(ఏసీఈ) ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుస్మిత నాలుగో సంవత్సరం ట్యూషన్‌ ఫీజు చెల్లించలేదు. కళాశాల యాజమాన్యం ఫీజు కోసం పలుమార్లు అడిగినప్పటికీ తన తండ్రి ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పేది. కానీ, ఇంట్లో మాత్రం ఎప్పుడు ఫీజు గురించి తండ్రికి చెప్పలేదు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కళాశాల యాజమాన్యం తండ్రి రాజేంద్రప్రసాద్‌కు ఫోన్‌ చేసి ట్యూషన్‌ ఫీజు చెల్లించనందున తాము పరీక్ష ఫీజు రూ.1000 తీసుకోలేదని.. అపరాధ రుసుంతో కలిపి పరీక్ష ఫీజు రూ. 10,000 కట్టాలని వివరించారు.

మనస్తాపంతో భవనంపై నుంచి దూకేసింది..

ట్యూషన్‌ ఫీజు గురించి ప్రతిరోజు మీ కుమార్తెకు గుర్తు చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఆయన తన ఇంటికి ఫోన్‌ చేసి భార్య మాధవికి విషయాన్ని చెప్పాడు. ఫీజు విషయం ఎందుకు చెప్పకుండా ఎందుకు దాచావని తల్లి ప్రశ్నించడంతో ఎటూ చెప్పలేక మనస్తాపానికి గురైన సుస్మిత భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకేసింది.

తీవ్రంగా గాయపడిన ఆమెను ఇంటి యజమాని సత్యనారాయణమూర్తి తన కారులో విద్యానగర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. కాగా, ఫీజు విషయంలో అందరు విద్యార్థులకు ఫోన్ చేసినట్లుగానే సుస్మితకు చేశామని కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థిని ఆత్మహత్య బాధాకరమని వ్యాఖ్యానించింది.