యువతిపై బ్లేడ్ దాడి కేసులో కొత్తకోణం: ప్రేమ పేరుతో 3నెలలుగా..

4:01 pm, Sat, 9 March 19
attacked with blade and filmed in Hyderabad, Newsxpressonline

హైదరాబాద్‌: నగరంలోని గాంధీనగర్‌ డీబీఆర్‌ మిల్స్‌ వద్ద బాలికపై బ్లేడ్ దాడి ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దాడికి గురైన బాలిక, దాడి చేసిన బాలుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడటం సహించలేకే బాలుడు ఆమెపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన జరిగిందని తెలిపారు. బాలికకు ఫోన్‌ చేసి డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతానికి బాలుడు పిలిపించాడని.. వేరే వ్యక్తితో ఎందుకు మాట్లాడుతున్నావంటూ బ్లేడ్‌తో దాడి చేశాడని పోలీసులు చెప్పారు.

ప్రేమ పేరుతో నమ్మించి మూడు నెలలుగా..

అనంతరం వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని.. విషయం బయటకి చెబితే వీడియో అందరికీ చూపిస్తానని బెదిరించాడని చెప్పారు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి మూడు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నట్లు వెల్లడించారు.

బాలుడి దాడి నుంచి అమ్మాయిని కాపాడిన స్థానికులు.. అతడ్ని పోలీసులకు అప్పగించారని తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మాయిది దోమలగూడ, అబ్బాయిది బషీర్‌బాగ్ అని వెల్లడించారు.

విచారణ అనంతరం బాలుడిని జువైనల్‌ హోంకు తరలించనున్నట్లు చిక్కడపల్లి ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వారిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.