ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ అరెస్ట్!…. బ్రాహ్మణులపై ద్వేషంతో చోరీలు చేస్తున్న వైనం…

kulasekhar
- Advertisement -

kulasekhar

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత పల్లెర్లమూడి కులశేఖర్ (47)ను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఓ ఆలయ పూజారి చేతిలో సంచిని దొంగతనం చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా సింహాచలానికి చెందిన కులశేఖర్ హైదరాబాద్ మోతీనగర్‌లో ఉంటూ సినిమాలకు పాటలు రాస్తున్నాడు. దాదాపు వందకుపైగా సినిమా పాటలు రాసిన ఆయన ప్రస్తుతం చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

- Advertisement -

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా  సిని పరిశ్రమకు, కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట బ్రాహ్మణ వర్గాలను కించపరిచేలా ఉందంటూ ఆ సామాజిక వర్గం అతడిని దూరం పెట్టింది. దీంతో బ్రాహ్మణులపై కక్ష పెంచుకున్న ఆయన పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలో పని చేస్తున్న పూజారి చేతి సంచిని దొంగిలించాడు. ఆదివారం శ్రీనగర్ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించిన కులశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కులశేఖర్ నుంచి రూ. 50 వేల విలువైన 10 మొబైల్ ఫోన్లు, రూ. 45 వేల విలువైన ఇతర వస్తువులు, ఇంకా క్రెడిట్, డెబిట్ కార్డులు, తాళం చెవులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు పంపారు.

కాకినాడలోని శ్రీబాలాత్రిపుర సుందరి ఆలయానికి 2013 అక్టోబరు 24న వెళ్లిన కులశేఖర్‌.. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి శఠ గోపరాన్ని అపహరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కులశేఖర్‌ దొంగతనం చేసినట్టు నిర్ధరణ కావడంతో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. 2016లో కూడా కాకినాడ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా శఠగోపాన్ని చోరీ చేశాడు. ఈ  కేసు విషయమై కులశేఖర్ రాజమండ్రి  జైలులో ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

- Advertisement -