షాకింగ్: మెట్రో పిల్లర్ ప్లాస్టరింగ్ పెచ్చులూడి పడి.. మహిళ దుర్మరణం

2:57 pm, Tue, 24 September 19
part-of-metro-station-roof-collapse-at-ameerpet-woman-dead

హైదరాబాద్: వర్షం పడుతుంది కదాని తలదాచుకోవడానికి మెట్రో స్టేషన్ కింద నిలబడిన ఓ మహిళ అదేసమయంలో అనుకోకుండా పైనుంచి ప్లాస్టరింగ్ పెచ్చు ఊడిపడిన ఘటనలో తలపగిలి తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడి డాక్టర్లు పరీక్షించి ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటన ఆదివారం మద్యాహ్నం హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. 

కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే హరికాంత్‌ రెడ్డి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్‌ వసతి చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌లో రైలు ఎక్కి అమీర్‌పేట్‌ స్టేషన్‌లో దిగారు.

అనంతరం మౌనిక, మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్‌ మెట్లు దిగి కిందికి వచ్చారు. అప్పటికే వర్షం పడుతుండటంతో కాస్తే తగ్గే వరకు తలదాచుకుందామని మెట్రోస్టేషన్‌ మెట్ల మార్గంలోనే ఓ పిల్లర్‌ కింద నిలుచున్నారు. 

అదే సమయంలో పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్‌ కాంక్రీటు అంచులు పెచ్చులూడి కిందపడ్డాయి. దాదాపు తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి నేరుగా మౌనిక తలపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. 

ఈ మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందడంతో వారు మౌనిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్‌ జిల్లా అని, ఆమెకు హరికాంత్ రెడ్డితో ఈ మద్యనే వివాహమైందని సమాచారం.