ఘోరం: నడిరోడ్డుపై యువకుడ్ని చావబాదిన రౌడీ షీటర్లు, ఏం జరిగింది?

4:48 pm, Tue, 2 April 19
young-man-brutally-attacked-by-rowdy-sheeters-in-nizamabad

నిజామాబాద్: నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోయి నడిరోడ్డుపై దాడులకు తెగబడ్డారు. ఓ యువకుడ్ని చితకబాదడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నిచగా వారిపైనా దాడులు చేసి గాయపర్చారు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి నిజామాబాద్ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన రాజు అనే యువకుడ్ని లాక్కొచ్చిన శ్రీనివాస్, క్రాంతి కుమార్, సాయిలు అనే రౌడీ షీటర్లు కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. కాళ్లతో తంతూ చితక్కొట్టారు. సీసాలతోనూ దాడులు చేశారు. యువకుడికి రక్తం కారుతున్నా.. వదిలేయాలని వేడుకున్నా రౌడీషీటర్లు కనికరం చూపలేదు.

స్థానికులు అడ్డుకుంటే..

కొందరు స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారు. చివరకు తీవ్రగాయాలపాలైన బాధిత యువకుడ్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోడిగుడ్డు విషయంలో గొడవతోనే వివాదం జరిగిందని.. అందుకే యువకుడిపై దాడి చేశారని కొందరు అంటుండగా.. బాధితుడి కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది.

రౌడీషీటర్లు క్రాంతి, శ్రీనివాస్ కొద్ది రోజులుగా గంజాయి, మద్యం మత్తులో స్థానికులపై దాడి చేస్తున్నారు. దీంతో స్థానికులపై దాడులు ఎందుకు చేస్తున్నారంటూ రాజు వారిని నిలదీశాడు. ఆ కక్షతోనే రాజుపై దాడి చేశారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: ప్రాణం తీసిన ఫీజు: మూడో అంతస్తుపైనుంచి దూకిన బీటెక్ విద్యార్థిని